Bandi Sanjay: 50 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ నిధులు..రేవంత్ బకరా
టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో బకరా కాబోతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న 50 మంది ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ నిధులు ఇస్తున్నారని ఆరోపించారు. ఆయా నేతలు మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకి మారతారని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ 50 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నిధులు ఇస్తున్నారని తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(bandi sanjay) ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన 60 సీట్లకు బీఆర్ఎస్ కు తక్కువగా ఉంటే..ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు మారతారని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బకరా అవుతారని వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌పై సీఎం కేసీఆర్ కళ్లు ఉన్నాయని బండి సంజయ్ అన్నారు.
అయితే బీజేపీ(BJP)లో తాను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఒకరిద్దరు మాట్లాడితే తాను సీఎం కాలేనని బండి సంజయ్ అన్నారు. అంతేకాదు ఇంకా కొంతమంది నేతలకు కేసీఆర్ బి-ఫారం కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. బీసీలకు బీఆర్ఎస్ 23 సీట్లు ఇచ్చిందని, కాంగ్రెస్ 19 సీట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. రెండు పార్టీలు బీసీలకు వ్యతిరేకమని సంజయ్ అన్నారు. కానీ తమ పార్టీ బీసీలకు 30కిపైగా సీట్లు ఇచ్చినట్లు చెప్పారు. దీంతోపాటు రాష్ట్రంలో సీఎం పదవి కూడా బీసీ వ్యక్తికే ఇస్తుందని వెల్లడించారు.
ఓ ఇంటర్వ్యూలో భాగంగా పేర్కొన్న బండి సంజయ్ తన ఎన్నికల ప్రచారాన్ని నవంబర్ 7 నుంచి ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. తాను కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్నానని, అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యే గంగుల కమలాకర్(gangula kamalakar)ను సవాలు చేయబోతున్నానని చెప్పారు. సంజయ్ తన సొంత నియోజకవర్గంపై దృష్టి సారించడంతో పాటు, ఇతర బీజేపీ అభ్యర్థులతో కలిసి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రచారంలో పాల్గొంటారు.