హాత్ సే హాత్ జోడో యాత్ర ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ప్రారంభిస్తామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రకటించారు. భద్రాచలం రాముల వారి సన్నిధి నుంచి పాదయాత్రను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. గాంధీభవన్ లో శనివారం పీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ వ్యవహారల ఇన్ చార్జి మాణిక్ రావ్ ఠాక్రే, ఇతర సీనియర్ నాయకులతో హాత్ సే హాత్ జోడో యాత్రపై చర్చించారు. పాదయాత్ర ఎక్కడ ప్రారంభించాలి? ఏర్పాట్లు ఎలా? అనే వంటి అంశాలపై సమాలోచనలు చేశారు.
సమావేశం వివరాలు వెల్లడిస్తున్న రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్ చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే
అనంతరం రేవంత్ రెడ్డి పాదయాత్ర వివరాలు మీడియాకు వెల్లడించారు. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి రెండు నెలల పాటు పాదయాత్ర ఉంటుందని తెలిపారు. హాత్ సే హాత్ జోడోలో భాగంగా పాదయాత్ర చేస్తానని చెప్పారు. భద్రాచలంలో పాదయాత్ర ప్రారంభం సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రియాంకాగాంధీ హాజరవుతారని ప్రకటించారు. అయితే ఠాక్రేతో సమావేశానికి మూడుసార్లు గైర్హాజరైన నాయకుల వివరణ తీసుకుంటామని చెప్పారు. కీలక సమయాల్లో సమావేశాలకు రాని నేతలను పార్టీ నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటామని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.