Vande Sadharan Trains: జనవరి నుంచి ‘వందే సాధారణ్’ రైళ్లు.. ప్రత్యేకతలివే
వందే భారత్ ట్రైన్లలో ప్రయాణం అంటే కొంత ఖర్చుతో కూడుకున్న పని. అయితే సామాన్యుల కోసం, అల్పాదాయ వర్గాల ప్రజల కోసం త్వరలోనే వందే సాధారణ్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.
దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లను పీఎం మోదీ సర్కార్ తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లతో భారత రైల్వే శాఖ విప్లవాత్మక మార్పులను తెచ్చింది. ఇందులో ప్రయాణించేవారికి మెరుగైన సేవలను అందిస్తోంది. అలాగే అత్యాధునిక సౌకర్యాలతో మరిన్ని రైళ్లను తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ కృషి చేస్తోంది. ఇప్పుడున్న రైళ్లకన్నా మరింత వేగంగా, మరింత సౌకర్యంగా ప్రయాణించేందుకు వందేభారత్ ట్రైన్ అద్భుతంగా ఉపయోగపడుతుందని కేంద్రం తెలిపింది.
రాత్రిపూట ప్రయాణాల కోసం ఇటీవలె స్లీపర్ కోచ్‌లను కూడా వందేభారత్ ట్రైన్లలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుగా రైల్వే శాఖ ప్రకటించింది. అయితే ఈ వందే భారత్ ట్రైన్ల ధరలకు చాలా మంది జంకుతున్నారు. ఇందులో ప్రయాణం చేయడానికి చాలా మంది ముందుకు రావడం లేదు.
అందుకే అల్పాదాయ వర్గాల ప్రజల కోసం కేంద్రం మరో సరికొత్త ట్రైన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. వందే సాధారణ్ రైళ్లను జనవరి నుంచి పట్టాలెక్కించనుంది. ఈ ట్రైన్లు నాన్ ఏసీతో ఉంటాయి. నాన్ ఏసీ కోచ్‌ల తయారీని వేగవంతం చేస్తున్నట్లు చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అధికారులు వెల్లడించారు.
ఈ వందే సాధారణ్ ట్రైన్లలో కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఒక్కో ట్రైన్‌కు గరిష్ఠంగా 24 కోచ్‌లను ఏర్పాటు చేశారు. వెనకా ముందు పుష్ ఫుల్ ఇంజిన్లు, సాధారణ రైళ్లతో పోలిస్తే ఇందులో మెరుగైన సీట్లు ఉంటాయి. ప్రతి బెర్త్ వద్ద ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది. కోచ్ లల్లో అనౌన్స్మెంట్ స్క్రీన్లు, ఆడియో వ్యవస్థతో పాటుగా బయో వాక్యూమ్ టాయిలెట్లు, ఆటోమేటిక్ డోర్లు కూడా ఉంటాయి. నిఘా కోసం సీసీ కెమెరాలను కూడా అమర్చారు. జనవరిలో ఈ ట్రైన్లు అందుబాటులోకి రానున్నట్లు అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ అతి త్వరలోనే ఈ వందే సాధారణ్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి.