»3d Treatment For Brain Injuries Scientists Have Discovered A New Method
3D treatment for brain : మెదడు గాయాలకు ‘త్రీడీ’ ట్రీట్మెంట్..సైంటిస్టులు కనుగొన్న అద్భుతం!
మెదడులోని గాయాలను నయం చేసేందుకు శాస్త్రవేత్తలు సరికొత్త విధానాన్ని కొనుగొన్నారు. బ్రిటన్ లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో మెదడు గాయాలను ఒక్కరోజులోనే నయం చేసే మార్గాన్ని అభివృద్ధి చేశారు.
టెక్నాలజీ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. సరికొత్త టెక్నాలజీతో చాలా రకాల వ్యాధులు నయం అవుతున్నాయి. అసాధ్యం అనుకునే సర్జరీలను సైతం టెక్నాలజీ సాయంతో వైద్యులు సులభంగా చేయగలుగుతున్నారు. ఒకప్పుడు సర్జరీ అంటే కుట్లు వేయాల్సి వచ్చేది. ఇప్పుడు కుట్లే లేని సర్జరీలు వచ్చేశాయి. వైద్యరంగంలో కొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదే క్రమంలో మరో అద్భుతాన్ని బ్రిటన్ లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు.
మెదడులో గాయం అయితే త్రీడీ ట్రీట్మెంట్ ద్వారా నయం చేసే టెక్నాలజీని సృష్టించారు. బ్రిటన్ లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. దీని వల్ల మెదడులో గాయాలను ఒక్క రోజులోనే నయం చేసి వారికి ఉపశమనాన్ని కలిగించొచ్చు. మెదడులోని నాడీ కణాలను త్రీడీ ప్రింట్ తీయొచ్చని పరిశోధకులు నిరూపించారు.
సాధారణంగా పక్షవాతం, ట్రామా, క్యాన్సర్ వంటి శస్త్రచికిత్సల వల్ల మెదడులో గాయాలు అయ్యి మానవుల కమ్యూనికేషన్, కదలికలు, మేధో సామర్థ్యాలు దెబ్బతింటారు. అలాంటి ఇబ్బందికర పరిస్థితిని నివారించేందుకు బ్రిటన్ లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సరికొత్త పరిష్కార మార్గాన్ని గుర్తించారు. నాడీకణ మూలకణాల సాయంతో త్రీడీ ప్రింటింగ్ విధానంలో రెండు పొరల మెదడు కణజాలాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
శాస్త్రవేత్తలు మొదటగా దీనిని ఎలుకలలో పరీక్షించారు. ఎలుకల్లో బాహ్యపొర కణజలం అచ్చం సహజసిద్ధ నిర్మాణం తరహాలో పనిచేసినట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. మానవుల్లో మెదడు గాయాలకు మెరుగ్గా మరమ్మతులు చేసేందుకు ఆ త్రీడీ ముద్రణ విధానం ఎంతగానో పనిచేస్తుందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 70 మిలియన్ల మంది ప్రజలు ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీ (TBI)తో బాధపడుతున్నారని గణాంకాలు తెలిపాయి. వీటికి చికిత్సలు కూడా లేవు. ఈ త్రీడీ ప్రింటింగ్ మార్గం అందుబాటులోకి వస్తే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని పరిశోధకులు భావిస్తున్నారు.