Guinness Record: పేక ముక్కలతో 15 ఏళ్ల కుర్రాడి గిన్నిస్ రికార్డ్
కొంతమంది జీవితాల్లో కరోనా చీకట్లు చిమ్మితే.. మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపింది. లాక్డౌన్లో చేసిన నిరంతర సాధన ఈ రోజు ఓ కుర్రాడిని గిన్నిస్ రికార్డు ఎక్కేలా చేసింది. పేక ముక్కలతో మేడ కట్టి గత రికార్డును బద్దలుకొట్టి గిన్నిస్ రికార్డులోకి నెక్కాడు. ఇంతకీ ఎవరు ఆ కుర్రాడో.. తెలుసుకుందాం.
Guinness Record: కోల్ కత్తాకు చెందిన 15 ఏళ్ల కుర్రాడు పేక ముక్కలతో(playing cards) మేడలు కట్టి రికార్డు సృష్టించాడు. ఆ కుర్రాడి పేరు అర్నవ్ దగా. పదోతరగతి చదువుతున్న ఈ కుర్రాడు ప్లేయింగ్ కార్డ్స్‌తో నాలుగు ఎత్తయిన నిర్మాణాలు చేప్టటి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఆ క్రమంలో గతంలో ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. కోల్‌కత్తాలో ఉండే షాహిద్ మినార్, సాల్ట్ లేక్ స్టేడియం, ఎస్టీ, పాల్ కేథడ్రల్ రూపాలను ఈ పేక ముక్కలతో నిర్మించాడు. దీని నిర్మాణానికి అర్నవ్ సుమారు 1.43 లక్షల ప్లేయింగ్ కార్డ్స్ ఉపయోగించాడు. మొత్తం 41 రోజుల్లో ఈ నాలుగు నిర్మాణాలను పూర్తి చేశాడు. అయితే వాటిని అంటించడానికి ఎలాంటి టేప్ వాడలేదు. కేవలం జిగురు ఉపయోగించి ఈ ముక్కలను అంటించాడు.
ఈ ప్రాజెక్ట్ మొత్తం పొడవు 40 అడుగుల ఎత్తు, 11 అడుగుల 4 అంగుళాల వెడల్పు, 16 అడుగుల 8 అంగుళాలు ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ప్లేయింగ్ కార్డ్స్ నిర్మాణం ఇదే. గతంలో బ్రయాన్ బెర్గ్ పేరిట్ ఉన్న రికార్డును అర్నవ్ బద్దలుకొట్టి..గిన్నిస్ రికార్డులోకి ఎక్కాడు. ఎనిమిదేళ్ల వయస్సు నుంచే అర్నవ్ పేక ముక్కలతో చిన్న చిన్న మేడలు కట్టడం స్టార్ట్ చేశాడు. చదువుతూనే రోజూ ప్రాక్టీస్ చేసేవాడు. కరోనా సమయంలో ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ సమయం దొరికింది. అలా ఎంతగానో శ్రమించాడు. ఈ రికార్డు గురించి గతేడాది కూడా ప్రయత్నించి విఫలం అయ్యాడు. కానీ అర్నవ్ ఈసారి పట్టువదలకుండా ప్రయత్నించి గిన్నిస్ రికార్డ్‌లోకి ఎక్కి అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు.