కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో మంకీ ఫీవర్‌తో ఇద్దరు మృతిచెందడం తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్రంలో మంకీ ఫీవర్ కేసులు రోజు రోజుకు పెరగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ఆరోగ్యశాఖ అధికారులు తగిన రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు చేపట్టవలసిన చర్యలపై ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు.
శివమొగ్గ జిల్లా హొసనగర తాలూకాకు చెందిన 18 ఏళ్ల యువతి, ఉడుపి జిల్లా మణిపాల్‌కు చెందిన ఒక వృద్ధుడు చికిత్స పొందుతూ మృతిచెందారు. మంకీ ఫీవర్ కు సంబంధించి ఉత్తర కన్నడలో 34, శివమొగ్గలో 12, చిక్కమగళూరులో మూడు కేసులు నమోదైనట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ రణ్‌దీప్ తెలిపారు. అంతేగాక శివమొగ్గలో చికిత్స పొందుతున్న రోగుల వివరాలను డాక్టర్లను అడిగి వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.
ఇప్పటివరకు 2,288 నమూనాలను సేకరించి పరీక్షించగా అందులో 49 మందికి మంకీ ఫీవర్ ఉన్నట్లు గుర్తించామని డాక్టర్లు తెలిపారు. కోతులను కరిచిన కీటకాలు మళ్లీ మనిషిని కుడితే ఈ వ్యాధి సోకుతుందని డాక్టర్లు స్పష్టం చేశారు. వ్యాధి సోకిన వారికి తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయని, ఈ వ్యాధి సోకకుండా వ్యాక్సిన్ వేయించేందుకు ఐసీఎంఆర్ ప్రతినిధులతో సంప్రదింపులు చేస్తున్నామని తెలిపారు.