బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ గురువారం క్షమాపణలు చెప్పారు. కారు ప్రచార వీడియోలో ఆయన సీటు బెల్ట్ ధరించలేదు. దీంతో తన సీటు బెల్ట్‌ను తొలగించి తప్పు చేశానని అంగీకరించారు. నార్త్-వెస్ట్ ఇంగ్లండ్‌లో డ్రైవింగ్ చేస్తున్న సమయంలో సోషల్ మీడియా వీడియో చిత్రీకరణ కోసం ఆయన తన సీట్ బెల్ట్ తొలగించారు. బ్రిటీష్ చట్టాల ప్రకారం వాహనం కదులుతున్నప్పుడు సీటు బెల్ట్ ధరించనందుకు డ్రైవర్లు, ప్రయాణీకులకు 500 పౌండ్ల వరకు జరిమానాను విధిస్తారు. ఇప్పుడు స్వయంగా ప్రధాని చట్టాన్ని పాటించలేదు. ఇది విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి వివరణ ఇచ్చారు.
హడావిడిగా నిర్ణయం తీసుకోవడంతో పొరపాటు జరిగిందని వెల్లడించారు. ఒక చిన్న వీడియో చిత్రీకరణ కోసం ప్రధాని తన సీటు బెల్టును తీశారని స్పష్టం చేశారు. అలా చేయడం కూడా తప్పేనని ప్రధాని అంగీకరించారన్నారు. ఈ ఘటనపై ఆయన క్షమాపణలు చెప్పారని, ప్రతి ఒక్కరు సీటు బెల్టు ధరించాలనేదే ప్రధాని ఉద్దేశ్యం అన్నారు. బ్రిటన్ చట్టాల ప్రకారం సీటు బెల్టు ధరించకుంటే అక్కడికి అక్కడే 100 పౌండ్లు జరిమానా విధిస్తారు. కోర్టు వరకు వెళ్తే 500 పౌండ్ల వరకు ఫైన్ పెరుగుతుంది. వైద్యపరమైన సమస్యలు ఉంటే మాత్రమే మినహాయింపు ఉంటుంది.
దేశవ్యాప్తంగా వంద ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే ప్రక్రియలో భాగంగా రిషి సునక్ ఆ వీడియో చిత్రీకరణలో పాల్గొన్నారు. దీనిపై లేబర్ పార్టీ నేతలు విమర్శలు చేశారు. రిషి సునక్‌కు తన సీటు బెల్టు, డెబిట్ కార్డు, ఆర్థిక వ్యవస్థ, ఈ దేశాన్ని ఎలా నిర్వహించాలో తెలియదని ఎద్దేవా చేశారు. ఎలా నిర్వహించాలో ఆయనకు తెలియని జాబితా రోజు రోజుకు పెరుగుతోందన్నారు.