»Chinas Controversial Comments On Chandrayaan 3 Argument That It Did Not Land On The South Pole
China Disputes: చంద్రయాన్ 3పై చైనా వివాదాస్పద వ్యాఖ్యలు..దక్షిణ ధ్రువంపై దిగలేదని వాదన
భారత్ చేపట్టిన చంద్రయాన్3పై చైనా శాస్త్రవేత్త వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్3 అనేది ల్యాండ్ కాలేదని వాదించారు. ఈ విషయంలో ఇస్రో ఇంతవరకూ స్పందించలేదు.
భారత్ (India)పై చైనా (China) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. గత కొన్నేళ్లుగా చైనా, పాకిస్తాన్ రెండు దేశాలు భారత్‌కు సంబంధించిన ప్రతి విషయంలోనూ తమ అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నాయి. ఆ దేశాలకు సాధ్యం కాని విజయాలను భారత్ సాధించిందనే కోపంతో నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నోరు పారేసుకుంటున్నాయి. ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కానివిధంగా చంద్రుని దక్షిణ ధ్రువంపై ఇస్రో పంపిన చంద్రయాన్3 కాలుమోపింది.
భారత్ చేపట్టిన చంద్రయాన్3పై అంతర్జాతీయంగా ఎన్నో ప్రశంసలు దక్కుతున్నాయి. ఇస్రో శాస్త్రవేత్తల కృషిని ప్రపంచ నలుమూలల్లో ఉన్న శాస్త్రవేత్తలు సైతం కొనియాడుతున్నారు. అయితే పొరుగున ఉన్న చైనా మాత్రం తన వక్రబుద్ధిని చూపుతోంది. అసలు చంద్రయాన్3 చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి వెళ్లలేదని వాదనలు వినిపిస్తోంది.
చంద్రునిపై చేసే పరిశోధనలకు సంబంధించి పితామహుడిగా పేరుపొందిన శాస్త్రవేత్త ఒయాంజ్ జియూన్ చంద్రయాన్3పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ అయిన శివశక్తి పాయింట్ అనేది చంద్రుడి దక్షిణ అక్షాంశంలో 69 డిగ్రీల వద్ద ఉందని, ఇస్రో చెప్పినట్లుగా 88.5 డిగ్రీల నుంచి 90 డిగ్రీల మధ్య లేదని ఆయన చైనీస్ పత్రిక సైన్స్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
చంద్రయాన్ 3 (Chandrayan3) ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్ జాబిల్లి దక్షిణ ధ్రువానికి 619 కిలోమీటర్ల దూరంలో ఉందని ఒయాంజ్ జియూన్ వాదించారు. ఓ వైపు ప్రపంచ దేశాలకు సాధ్యం కాని విధంగా అతి తక్కువ బడ్జెట్లోనే అన్ని దేశాల కంటే ముందుగా చంద్రయాన్3ని ప్రయోగించి భారత్ సక్సెస్ అయ్యింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలు పెట్టిన తొలి దేశంగా భారత్ నిలిచింది. ప్రపంచం మొత్తం కొనియాడుతున్న వేళ చైనా (China) వింత వాదనలు చేయడంలో అర్థం లేదని శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. అయితే చైనా శాస్త్రవేత్త చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ఇప్పటి వరకూ స్పందించలేదు.