స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు (skil Developement scam case)లో సీఐడీ అధికారులు టీడీపీ (TDP) అధినేత చంద్రబాబును అరెస్ట్ (Chandrababu Arrest) చేసిన సంగతి తెలిసిందే. నంద్యాలలో ఆయన్ని అరెస్ట్ చేసిన అధికారులు విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. సీఐడీ ఆఫీసులోనే చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. బాబు ముందు 20 ప్రశ్నలను సీఐడీ అధికారులు ఉంచారు. ఆయన స్టేట్మెంట్ను అధికారులు రికార్డు చేస్తున్నారు.
సీఐడీ విచారణ (CID Investigation) తర్వాత బాబును విజయవాడ (Vijayawada) ప్రభుత్వాస్పత్రికి తరలించనున్నారు. ఈ నేపథ్యంలో అదనంగా మరో కాన్వాయ్‌ని కూడా సిద్ధం చేశారు. వైద్య పరీక్షల తర్వాత చంద్రబాబును సీఐడీ (CID) అధికారులు కోర్టులో హాజరపరచనున్నారు.
చంద్రబాబు వందల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని, అందులో భాగంగానే ఆయన్ని అరెస్ట్ చేసినట్లు సీఐడీ (CID) తెలిపింది. దీంతో ఏపీ వ్యాప్తంగా టీడీపీ (TDP) కార్యకర్తలు నిరసనలు తెలుపుతున్నారు. రోడ్లపై భైటాయించి ధర్నా చేపడుతున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ వారిని అరెస్ట్ చేస్తున్నారు. చంద్రబాబును జైల్లో పెట్టనున్నారా? లేకుంటే బెయిల్ పై పంపిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
సిట్ కార్యాలయంలో ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో బాబును కోర్టులో ప్రవేశపెట్టేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. నేషనల్ లోక్ అదాలత్ కొనసాగుతోన్న నేపథ్యంలో ఇంకా కోర్టులోనే ఏసీబీ కోర్టు జడ్జి ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కోర్టు పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు అలాగే కొనసాగుతున్నాయి. ఒకవేళ సమయం దాటితే జడ్జి నివాసంలోనే చంద్రబాబును ప్రవేశపెట్టే అవకాశం ఉందని సీఐడీ అధికారులు చెబుతున్నారు.