Shame on Congress party chief Mallikarjun Kharge not invited to g20 summit
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను శనివారం నిర్వహించనున్న జీ20 విందుకు ఆహ్వానించలేదని ఆయన కార్యాలయం ధృవీకరించింది. అంతేకాదు ఖర్గే క్యాబినెట్ మంత్రి హోదాను కూడా కలిగి ఉన్నారు. దేశంలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. దీంతోపాటు మరే ఇతర రాజకీయ పార్టీల నేతలకు కూడా ఆహ్వానం అందలేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. శనివారం రాష్ట్రపతి భవనంలో దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపతీ ముర్ము సమక్షంలో విందు కార్యక్రమం జరగనుంది. మరోవైపు ఈ జీ20 సమ్మిట్ విందుకు హాజరు కావాల్సిందిగా మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్డి దేవెగౌడలను కూడా ఆహ్వానించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన నేతకు ఆహ్వానం రాకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
బీహార్ సీఎం నితీష్ కుమార్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, పశ్చిమ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం MK స్టాలిన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ విందు గాలాకు హాజరవుతారని ధృవీకరించిన ముఖ్యమంత్రులలో ఉన్నారు. ఢిల్లీ ప్రగతి మైదాన్‌లోని ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ కాంప్లెక్స్ లో భారీ సామర్థ్యం కలిగిన భారత్ మండపంలోని మల్టీ ఫంక్షన్ హాల్లో గాలా డిన్నర్ జరుగనుంది. గాలా డిన్నర్‌తో పాటు ఒక చిన్న సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించనున్నారు.
G20 సమ్మిట్ వచ్చే 24 గంటల్లో అంటే రేపు ప్రారంభం కానుంది. అయితే ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, UK ప్రధాని రిషి సునక్ సహా ఇతర దేశాల ప్రతినిధులు శుక్రవారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఢిల్లీ పోలీసులు జారీ చేసిన సలహాల ప్రకారం, ఢిల్లీలోని వివిధ ప్రాంతాలలో ఈరోజు (8 సెప్టెంబర్) నుంచి ట్రాఫిక్ చర్యలు అమల్లోకి వచ్చాయి.