»Covid 19 Treatment Babys Eyes Turned Blue After Corona Treatment
Covid 19 Treatment : కరోనా చికిత్స తర్వాత నీలిరంగులోకి మారిన పసిబిడ్డ కళ్లు!
కరోనా చికిత్స పొందిన ఓ చిన్నారి కళ్లు నీలం రంగులోకి మారిపోయాయి. ఆ పాపను పరీక్షించిన వైద్యులు చిన్నారి కళ్లు అలా మారడానికి ఓ మెడిసిన్ కారణం అని గుర్తించారు. వెంటనే ఆ మెడిసిన్ వాడకాన్ని ఆపేశారు.
కరోనా (Corona) ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికి కూడా కరోనా ఛాయలు వదలడం లేదు. కరోనా సోకి చికిత్స పొందినవారు పలు సమస్యలతో బాధపడుతున్నట్లు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కోవిడ్ తర్వాత హార్ట్ ఎటాక్‌లు పెరిగాయని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. తాజాగా కోవిడ్ చికిత్స తీసుకున్న ఓ చిన్నారి కళ్లు నీలం రంగులోకి మారిపోయాయి. ఈ ఘటన థాయ్‌లాండ్ (Thailand)లో చోటుచేసుకుంది.
మెడికల్ జర్నల్ ఫ్రాంటియర్స్ ఇన్ పీడియాట్రిక్స్ ప్రకారం.. థాయ్‌లాండ్‌కు చెందిన ఆరు నెలల పసిపాప జ్వరంతో బాధపడుతోంది. పాపను తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ కోవిడ్ టెస్ట్ చేశారు. రిపోర్ట్‌లో పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ చిన్నారికి మూడు రోజుల పాటు చికిత్స చేశారు. పాప ఆరోగ్యం మెరుగుపడ్డాక తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు.
అయితే చికిత్స తీసుకున్న కొన్ని గంటలకే ఆ చిన్నారి కళ్లు నీలం రంగులోకి మారిపోయాయి. 18 గంటల వ్యవధిలోనే ఆ పాప కళ్లు ముదురు గోధుమ రంగు నుంచి నీలిరంగులోకి మారడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వైద్యుల వద్దకు తీసుకెళ్లగా ఫెవిపిరావిర్ మెడిసిన్‌ను వెంటనే వాడటం ఆపేయాలని తెలిపారు. ఆ మెడిసిన్ ఆపేసిన ఐదు రోజులకు ఆ పసికందు కళ్లు మామూలు స్థితికి చేరింది. చిన్నారులకు కొవిడ్ ట్రీట్మెంట్గా ఫెవిపిరావిర్(favipiravir)ను థాయ్‌ల్యాండ్ ప్రభుత్వం 2022లోనే ఓకే చేసింది. చిన్నారి కళ్లు అలా అయిపోవడంతో అలర్ట్ అయ్యి ఆ మందు వాడకాన్ని ఆపింది.