Weight Loss: ఇక బరువు తగ్గేందుకు కూడా ఇంజక్షన్..ఎగబడుతున్న జనం!
బరువు తగ్గాలనుకునేవారికి గుడ్ న్యూస్. బరువు తగ్గించే ఇంజక్షన్ అందుబాటులోకి రానుంది. ఈ ఇంజక్షన్ ద్వారా సులభంగా బరువు తగ్గుతున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి.
అధిక బరువు వల్ల చాలా మంది ఆందోళన చెందుతున్నారు. బరువు తగ్గేందుకు ఎన్నో మందులు వాడినా ఫలితం ఉండదు. అలాంటి వారికి గుడ్ న్యూస్. బరువు తగ్గించే ఇంజక్షన్‌ను వెగోవీ అనే పేరుతో నోవో నోర్డిస్క్ అనే సంస్థ రిలీజ్ చేసింది. ఈ ఇంజక్షన్ ఇప్పటికే అమెరికా, జర్మనీ, నార్వే, డెన్మార్క్ దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. తాజాగా దీనిని యూకేలో కూడా మార్కెట్లోకి తీసుకొచ్చారు.
ఈ ఇంజక్షన్ వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని, అందుకే డిమాండ్ కూడా పెరుగుతోందని నోవో నోర్డిస్క్ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం యూకేలో ఈ ఇంజక్షన్ విడుదలను వాయిదా వేశారు. డిమాండ్‌ను పరిశీలించాక సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.
బరువు తగ్గేందుకు ఈ వెగోవీ ఇంజక్షన్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది కడుపు నిండిందనే భావనను కలిగిస్తుంది. ఆకలిగా ఉన్నా కూడా మనకు కడుపు నిండినట్లే అనిపిస్తుంది. మెదడు నుంచి వచ్చే ఆకలి సూచన తగ్గుతుంది. దీంతో తినడం తగ్గిస్తారు. తద్వారా బరువు బాగా తగ్గే అవకాశం ఉంది. వ్యాయామం చేస్తూ ఈ ఇంజక్షన్ తీసుకున్న వారు 15 శాతం బరువు తగ్గినట్లుగా నివేదికలు స్పష్టం చేశాయి.
అమెరికాలో ఈ ఇంజక్షన్‌ను 1350 డాలర్లు అంటే సుమారుగా రూ.లక్షా 12 వేలకు విక్రయిస్తున్నారు. యూకే ధరలు మాత్రం ఇంకా వెల్లడించాల్సి ఉంది. ఈ ఇంజక్షన్ డిమాండ్ పెరగడంతో తమకు కాస్త ఇబ్బందిగా ఉందని నోవో నోర్డిస్క్ సీఈవో తెలిపారు. డిమాండ్‌కు తగ్గట్టు ఇంజక్షన్ సరఫరా చేయడానికి ఇంకొన్నేళ్లు పడుతుందన్నారు.