»Shocking Doctors Put A Plate In The Womans Stomach And Stitched It
Cesarean operation : షాకింగ్..మహిళ కడుపులో ప్లేట్ పెట్టి కుట్టేసిన డాక్టర్లు!
డాక్టర్లు ఓ గర్భిణికి సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. తల్లీబిడ్డా బాగానే ఉన్నారు. డెలివరీ అయిన తర్వాత ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికెళ్లిపోయింది. అయితే ఒక సంవత్సరం తర్వాత ఆమెకు మెల్లగా కడుపు నొప్పి ఎక్కువవ్వడం మొదలైంది. స్కాన్ చేసిన డాక్టర్ ఆమె కడుపుతో ఉన్నది చూసి షాక్ అయ్యారు.
ఈ మధ్యకాలంలో డాక్టర్ల ఆపరేషన్లు బెడిసికొడుతున్నాయి. కొన్నిచోట్ల ఆపరేషన్ చేసిన సమయంలో కడుపులో కత్తెర పెట్టి కుట్టేయడం, దూది పెట్టి కుట్టేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా డాక్టర్లు ఓ మహిళకు సిజేరియన్ చేసి ఆమె కడుపులో ఏకంగా ఓ ప్లేట్ పెట్టి కుట్టేశారు. గర్భిణికి సిజేరియన్ చేసిన తర్వాత బిడ్డను బయటకు తీశారు. ఆ టైంలోనే కడుపులో ప్లేట్ పెట్టి కుట్టేసిన సంఘటన న్యూజిలాండ్ (New Zealand)లో చోటుచేసుకుంది.
న్యూజిలాండ్ హెల్త్ అండ్ డిసేబిలిటీ కమిషనర్ మొరాగ్ ఈ ఘటనకు సంబంధించి ఓ ప్రకటన చేశారు. 20 ఏళ్ల వయస్సున్న ఓ మహిళ పురిటి నొప్పులతో అక్లాండ్ నగరంలోని ఆస్పత్రికి చేరిందని, ఆమెకు నార్మల్ డెలివరీ చేయడానికి డాక్టర్లు ప్రయత్నించినట్లు తెలిపారు. ఎంతకూ డెలివరీ కాకపోవడంతో సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారన్నారు. ఆ తర్వాత డిశ్చార్జ్ అయినన ఏడాదిన్నర నుంచి ఆమె తీవ్ర కడుపు నొప్పితో బాధపడిందన్నారు.
సాధారణ కడుపు నొప్పి అనుకుని డాక్టర్లు ఇచ్చిన మెడిసిన్ వాడినట్లు తెలిపారు. అయితే కొన్ని రోజులకు తీవ్ర కడుపునొప్పి రావడంతో వైద్యులు ఆమెకు సిటీ స్కాన్ చేశారు. రిపోర్ట్ చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. కడుపులో ప్లేట్ ఉన్నట్లు గుర్తించి వెంటనే ఆమెకు సర్జరీ చేశారు. ఆ మహిళకు అత్యవసర శస్త్రచికిత్స చేసి కడుపులో ఉండే ప్లేటును బయటకు తీశారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. తనకు వైద్యులు చేసిన పనికి ఆ మహిళ పోలీసులను ఆశ్రయిస్తానని తెలిపింది.