సూర్యుడి (Sun)ని పరిశోధించేందుకు భారత అంతరిక్ష సంస్థ (ISRO) ఆదిత్య L1 (Aditya L1)ఉపగ్రహాన్ని పంపిన సంగతి తెలిసిందే. ఇస్రో చేపట్టిన ఈ మిషన్ తన టార్గెట్ దిశగా అంతరిక్షంలో ప్రయాణిస్తోంది. తాజాగా ఈ ఉపగ్రహం ఆకాశం నుంచి భూమి, చంద్రుని ఫోటోలు (Earth-Moon Photos), సెల్ఫీని పంపించింది. ఆకాశం నుంచి తీసిన ఆ ఫోటోలో భూగ్రహంతో పాటుగా చందమామ కూడా కనిపిస్తోంది. భూమి, చంద్రుడు ఒకేసారి కనిపించేలా ఆదిత్య శాటిలైట్ లోని కెమెరా ఫోటోలు తీసింది.
ఆదిత్య ఎల్1 (Aditya L1)మిషన్‌ను భారత్ సెప్టెంబర్ 2వ తేదిన ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ ఉపగ్రహం భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో సూర్యుడి సమీపంలో ఉన్న ఎల్-1 పాయింట్‌కు చేరుకునేందుకు 125 రోజులు అవుతుంది. ఆ ఎల్1 పాయింట్ నుంచే సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేయనుంది. ఇకపోతే ఆదిత్య L1లో మొత్తం ఏడు పరిశోధనా పరికరాలను అమర్చారు. అవి సూర్యుడి పొరలతో పాటుగా వాటి వెలుపల ఉండే కరోనాను కూడా అధ్యయనం చేయనున్నాయి.
సూర్యునిపై సౌర జ్వాలలు, సౌర రేణువులు, సూర్యునిపై ఉండే వాతావరణం, ఇలా ఎన్నో విషయాలను ఈ ఆదిత్య మిషన్ (Aditya Mission) కనుగొననుంది. ఇస్రో (ISRO) షేర్ చేసిన వీడియోలో అంతరిక్షం నుంచి భూమి, చంద్రుల ఫోటోలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. భూమి పెద్దగా కనిపిస్తుంటే చంద్రుడు చాలా చిన్నగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఆదిత్య ఎల్1 ఉపగ్రహం లాంగ్రేజ్ పాయింట్ వద్దకు దూసుకుపోతోంది. ఆ పాయింట్ వద్దకు చేరుకోవాలంటే మరో రెండు కక్ష్యల్లోకి ప్రవేశించాల్సి ఉంటుంది. అంటే దాదాపుగా 127 రోజుల పాటు ఈ ఉపగ్రహం కక్ష్యలోకి చేరుకోనుంది.