Telangana rains: రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు వర్షాలు!
తెలంగాణలో రానున్న మూడు రోజులు ఉత్తర, దక్షిణ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని 20 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ హెచ్చరికలు జారీ చేశారు.
Rainfall: తెలంగాణ(Telangana) రాష్ట్రంలో రాబోవు మూడు రోజులు అంటే ఆదివారం నుంచి మంగళవారం వరకు పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు(Heavy RainFalls) కురుస్తాయని వాతావరణశాఖ(Department of Meteorology) తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ జిల్లాలు అయిన ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, కొత్తగూడెం మొత్తం 20 జిల్లాలకు అధికారులు ఎల్లో అలెర్ట్ హెచ్చరికలు జారీచేశారు. శనివారం కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ(Hyderabad Meteorological Department) స్పష్టం చేసింది.
బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడిందని అది దక్షిణ ఆంధ్ర తీరం వరకు ద్రోణి విస్తరించి ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. దీంతో తెలంగాణలోని పలు జిల్లాలో వర్షప్రభావం ఉంటుందని అలాగే ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సెప్టెంబర్ 3న మరో ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నాయని వెదర్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ ఆవర్తనాల మూలంగానే వర్షాలు పడనున్నాయని వాతావరణశాఖ హైదరాబాద్ సంచాలకురాలు కె.నాగరత్న తెలిపారు. హైదరాబాద్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు.