తనకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆయన తాజాగా… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లిలో చదరి వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తుమ్మల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది ఎన్టీ రామారావు అని తెలిపారు. ఎన్టీఆర్ ఇచ్చిన రాజకీయ భిక్షతో ప్రజలు, ప్రాంతం, పేదలు, రైతులు, బడుగుల సంకల్పం కోసమే కష్టపడతానన్నారు. భవిష్యత్తులోనూ స్వర్గీయ ఎన్టీఆర్ సంకల్పం నెరవేరాలని ఆకాంక్షిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.
తనకు రాజకీయ జన్మనిచ్చిన నియోజకవర్గ ప్రజలను ఎప్పుడూ మరచిపోనని స్పష్టం చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ ప్రభుత్వాలలో ఎక్కడా తలవంచకుండా పనులు చేసి శభాష్ అనిపించుకున్నానన్నానని.. అది తనకు ఎన్టీఆర్ ఇచ్చిన శక్తి, స్ఫూర్తి అని పేర్కొన్నారు తుమ్మల నాగేశ్వరరావు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నానని అన్నారు.