ఏపీ(Andhrapradesh)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. అల్లూరి జిల్లాలోని పాడేరు ఘాట్ రోడ్డు (Paderu Ghat Road)లో ఆదివారం సాయంత్రం ఆర్టీసీ బస్సు లోయలో పడటంతో దారుణం జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు మృతిచెందారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. వారిలో 10 మందికి తీవ్ర గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
పాడేరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు విశాఖపట్నం నుంచి పాడేరు వైపుగా వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఘాట్ రోడ్డు వ్యూ పాయింట్ వద్ద ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా అదుపు తప్పింది. అక్కడి నుంచి పల్టీలు కొడుతూ 50 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. బస్సులో మొత్తం 45 మంది ప్రయాణిస్తుండగా అందులో 30 మందికి గాయాలయ్యాయి. బస్సు లోయలో పడటంతో వారిని కాపాడేందుకు అధికారులు, సహాయక సిబ్బంది కష్టపడాల్సి వచ్చింది.
గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మరో ఆర్టీసీ బస్సులో పాడేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు ఈ ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.