బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసినవాడే తలవంచుతాడని, తాను ఇంతవరకు రాజకీయాల్లో ఎవరికీ తలవంచలేదని తేల్చిచెప్పారు. ఇకపై తలొగ్గబోనని హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయ జీవితంలో ఎవరికి పాదాభివందనం చేయలేదని స్పష్టంచేశారు. డబ్బులు సంపాదించడం కాదు.. ఆత్మగౌరవంతో బతకాలని కోరారు. కడియం శ్రీహరికి ఎమ్మెల్యే రాజయ్య మధ్య విభేదాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఇద్దరు నేతలు విమర్శలు చేసుకున్నారు. ఇప్పుడు కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు రాజయ్యను ఉద్దేశించా అనే సందేహాం కలుగుతుంది. ఇద్దరు నేతలు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. తర్వాత సీఎం కేసీఆర్, సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని ఇద్దరిని పక్కన పెట్టారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజయ్యకు డిప్యూటీ సీఎం పదవీ వరించింది. కొన్నాళ్లకే ఆయన పదవీ నుంచి సీఎం కేసీఆర్ తప్పించారు. తర్వాత కడియం శ్రీహరికి పదవీ దక్కింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు నేతల మధ్య విభేదాలు ఉన్నాయి. ప్రభుత్వ కార్యక్రమంలో అయినా సరే ఎడ మొహం పెడ మొహంగా ఉంటారు. కలిసి పనిచేయాలని, పార్టీ కోసం శ్రమించిన వారికి పదవులు దక్కుతాయని కేసీఆర్ చాలా సందర్భాల్లో చెప్పారు. అయినప్పటికీ ఇద్దరు లెక్కచేయడం లేదు. మీడియా ముఖంగానే పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఇది పార్టీకి మంచిది కాదని పెద్దలు చెబుతోన్న సరే వారి వైఖరి మాత్రం మారడం లేదు.
ఎన్టీఆర్ పిలుపు మేరకు కడియం శ్రీహరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1987-1994 మధ్య వరంగల్ జిల్లా తెలుగు దేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 1988లో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారటీ చైర్మన్ పదవీ దక్కింది. 1994లో ఫస్ట్ టైమ్ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి సీఎం ఎన్టీఆర్ ప్రభుత్వంలో మార్కెటింగ్ శాఖ మంత్రిగా అవకాశం లభించింది. చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో సంక్షేమ శాఖ , విద్య నీటిపారుదల శాఖ మంత్రిగా భాద్యతలకు కూడా నిర్వహించారు. తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2013లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుంచి వరంగల్ నియోజకవర్గం ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 2015లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికై తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. సీఎం కేసీఆర్ అవకాశం కల్పించడంతో రెండోసారి కూడా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.