అప్పటి వరకు ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారి ఒక్కసారిగా కుప్పకూలింది. తల్లిదండ్రులు తేరుకునేలోపే క్షణంలో అంతా జరిగిపోయింది. నాటు తుపాకీ పేలడంతో విషాద ఘటన జరిగింది.
Gun blast: అప్పటివరకు అల్లారుముద్దుగా ఇంట్లో తిరిగిన చిన్నారి ఒక్కసారిగా విగతజీవి(Child dies)గా మారింది. అక్కడే ఉన్న తల్లిదండ్రులకు అసలేం జరిగిందో అర్థం కాలేదు. రక్తం మడుగులో కూతుర్ని చూసి గుండెలు బాదుకుంటూ పరుగుపరుగున ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఈ విషాద ఘటన కాకినాడ జిల్లా తుని మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కాకినాడ(Kakinada) జిల్లా తుని మండలం లోవకొత్తూరు గ్రామంలో నివాసం ఉంటున్న పలివెల రాజు, నాగమణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె ధన్యశ్రీ (4) మంగళవారం ఉదయం ఇంటి వద్ద ఆడుకుంటోంది. ఆ సమయంలో పక్కింట్లో నాటు తుపాకి పేలడం(gun blast)తో బుల్లెట్ నేరుగా వచ్చి ధన్యశ్రీ చాతిని చీల్చుకుంటూ బయటికి వెళ్లింది. చిన్నారి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అంతా క్షణంలో జరిగిపోయింది. తల్లిదండ్రులకు ఏం జరిగిందో అర్థం కాలేదు. బిడ్డను చేతుల్లోకి తీసుకొని ఆసుపత్రికి వెళ్లే సరికి అప్పటికే చిన్నారి మరణించిందని వైద్యులు తెలిపారు. కూతురి మరణవార్తను జీర్ణించుకోలేని వారు కన్నీరు మున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సీఐ సన్యాసిరావు, ఎస్సై విజయబాబు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతురాలి ఇంటికి సమీపంలో ఉన్న సిద్ధాంతపు దుర్గాప్రసాద్ అనే వ్యక్తి పందులను కాల్చేందుకు నాటు తుపాకీలో మందుగుండ్లు దట్టిస్తుండగా అది పొరపాటున పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు దుర్గాప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు.