రాజకీయ ముఖ్య నేతలను సినీ ప్రముఖులు వరసగా కలుస్తున్నారు. నిన్న చంద్రబాబుతో రజనీకాంత్ మీట్ కాగా.. ఇవాళ లోకేశ్‌తో తారకరత్న సమావేశం అయ్యారు. వరసకు బావ బావమరుదులు కానీ.. పార్టీ విషయాలపై చర్చించినట్టు సమాచారం. అంతేకాదు మరో ఏడాదిన్నరలో ఏపీకి ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో లోకేశ్‌ను కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన కూడా రాజకీయాల్లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడుతో కూడా ఇదే విషయం చెప్పారట. ఇవాళ లోకేశ్‌ని కలిసి.. పోటీ చేసే స్థానంపై డిస్కస్ చేసినట్టు సమాచారం. కానీ అదీ ఏ నియోజకవర్గమో ఇప్పటివరకు అయితే తెలియలేదు.
నిజానికి వీరి భేటీ మర్యాదపూర్వకమేనని అంటున్నారు. కానీ ఫ్యామిలీ విషయాలే కాదు.. రాజకీయాల గురించి కూడా మాట్లాడుకున్నారట. తారకరత్న ఇండస్ట్రీలో నిలబడలేకపోయారు. హీరోగా హిట్ రాకపోవడంతో విలన్‌గా కూడా చేశారు. తర్వాత వెబ్ సిరీస్‌కు మారిపోయారు. అటు నుంచి తనకు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ అని ఓ సందర్భంలో చెప్పారు. దీంతో చంద్రబాబు కూడా హామీ ఇచ్చారని తెలిసింది. ఏ సీటో తెలియదు.. కానీ ఇంతలో లోకేశ్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాదు లోకేశ్ పాదయాత్ర కూడా చేపట్టబోతున్నారు. దానికి సంఘీభావం తెలిపేందుకు వచ్చారనే ప్రచారం జరుగుతుంది.
నారా లోకేష్ యువ గళం పేరుతో జనవరి 27వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర చేపట్టబోతున్నారు. అందుకే తారకరత్న కలిశారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడే కాదు గతంలో కూడా తారకరత్న టీడీపీ తరఫున ప్రచారం చేశారు. తారకరత్న పోటీ చేయాలని డిసైడ్ అయితే అసెంబ్లీ సీటు ఇచ్చేందుకు టీడీపీ హై కమాండ్ సిద్దంగా ఉంది. తారకరత్నకు ఏ నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. లోకేష్‌తో ఇదే విషయంలో క్లారిటీ తీసుకునేందుకు తారకరత్న భేటీ అయినట్లు సమాచారం. టీడీపీకి నందమూరి కుటుంబం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని లోకేశ్‌తో తారకరత్న చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
తారకరత్న అసెంబ్లీకి పోటీ చేస్తారని తెలిసింది. కానీ నియోజకవర్గంపై క్లారిటీ లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ ఇంపాక్ట్ తగ్గినందున.. ఏపీ నుంచి బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయనకు టికెట్ ఇవ్వాలంటే అక్కడి నేతను కూల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తన వైపునకు తిప్పుకోవాలని చంద్రబాబు నాయుడు, లోకేశ్ అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ సందర్భంలో సిట్టింగులను తీసివేసి సీటు ఇవ్వడం అంటే మాములు విషయం కాదు. తారకరత్న గెలిస్తే ఫర్లేదు.. కానీ ఓడిపోతే మాత్రం పరిస్థితి వర్ణణాతీతం. పార్టీపై శ్రేణులకు విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉంది. కానీ చంద్రబాబు ఆ ఛాన్స్ తీసుకోరని కొందరు ఆనలిస్టులు విశ్లేషిస్తున్నారు. బలబలాలు అంచనా వేశాకే, మాట ఇస్తారని గుర్తుచేశారు.