CM KCR: చిన్న, సన్నకారు రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తోన్న రుణమాఫీపై ప్రకటన చేసింది. వెంటనే రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు సీఎం కేసీఆర్ (CM KCR) ఆదేశాలు జారీచేశారు. రేపటి నుంచి రుణమాఫీ ప్రక్రియ రాష్ట్రంలో ప్రారంభం కానుంది. రైతులకు మరో రూ.19 వేల కోట్ల రుణాలు అందించాల్సి ఉంది. గురువారం నుంచి రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించి.. సెప్టెంబర్ 2వ వారం లోపు పూర్తి చేయాలని స్పష్టంచేశారు.
కేంద్ర ప్రభుత్వం వల్లే రుణమాఫీ ఆలస్యమైందని సీఎం కేసీఆర్ అంటున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించింది. అందుకే రుణమాఫీ ఆలస్యం అయ్యిందని చెప్పారు. ఎఫ్ఆర్బీఎం నిధుల్లో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా కోత విధించిందని కేసీఆర్ (KCR) తెలిపారు. ఎన్నికలకు ముందు రుణమాఫీ అంశం విపక్షాలకు ఆయుధం కానుంది. ఈ క్రమంలో రుణ మాఫీ చేయాలని ఆదేశాలు జారీచేశారు. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇవే చివరి సమావేశాలు కానున్నాయి.