ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని విశాఖపట్టణంపై దుమారం కొనసాగుతోంది. వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. 3 రాజధానులకు కట్టుబడి ఉన్నామని సీఎం జగన్ చెబుతూనే ఉన్నారు. విశాఖపట్టణంలో పరిశ్రమలు విస్తరణ కూడా జరుగుతోంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాను విశాఖపట్టణంలో ఇల్లు కట్టుకుంటానని, విశాఖ వాసుడిని అవుతానని అన్నారు. వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో నిన్న (ఆదివారం) మాట్లాడారు. దీనిని వైసీపీ ముఖ్యనేత విజయసాయి రెడ్డి స్వాగతించారు. వెల్ కం విశాఖ అంటూ ట్వీట్ చేశారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో చిరంజీవి కాస్త ఉద్వేగానికి లోనయ్యారు. తాను ఇక్కడే స్థిరపడతానని, విశాఖ పౌరుడిని అవుతానని వెల్లడించారు. భీమిలి రోడ్ లో స్థలం కూడా కొనుక్కున్నానని చెప్పారు. త్వరలోనే ఇల్లు కట్టుకుంటానని చెప్పి.. సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. విశాఖ స్వర్గధామం అని, ఇక్కడికి వస్తే తనకు తెలియని సంతృప్తి ఉంటుందని పేర్కొన్నారు. విశాఖ వాసులు విశాల మనస్కులు అని వివరించారు. అందరూ చాలా హుందాగా ఉంటారని.. సినిమాలను చాలా ప్రేమిస్తారని తెలిపారు. అందుకే ఇక్కడ హాలీడే హోమ్ కట్టుకోవాలని అనుకుంటున్నానని, ఇక్కడే ఉంటానని ప్రకటించారు. ఆ సమయంలో జనాలు అంతా కేకలు వేసి హోరెత్తించారు.
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖలో స్థిరపడాలని అనుకున్న మెగాస్టార్ చిరంజీవికి విజయసాయిరెడ్డి వెల్ కం చెప్పారు. ఇదీ చాలా మంచి పరిణామం అని కామెంట్ చేశారు. మిగతా ప్రముఖులు కూడా స్పందించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి ఈ మేరకు ట్వీట్ చేశారు. చిరంజీవి కొత్త చిత్రం వాల్తేరు వీరయ్య మంచి విజయం సాధించాలని కోరుకున్నారు. విశాఖ డెవలప్ జరుగుతుందని, అందరికీ అనుకూలంగా ఉంటుందని చెప్పారు. విశాఖ రాజధానిపై విపక్షాలు కావాలనే రాద్దాంతం చేస్తున్నాయని ఇదివరకు చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. ఇప్పుడు చిరంజీవి చేసిన ప్రకటన సాయిరెడ్డికి కొండంత అండగా నిలిచినట్టు అయ్యింది.
మూడు రాజధానులపై జగన్ సర్కార్ కట్టుబడి ఉంది. కానీ మండలిలో బిల్లు విగిపోవడం, హైకోర్టు జోక్యంతో అదీ వాయిదా పడుతూ వచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్లలోనే మూడు రాజధానుల దిశగా సర్కార్ అడుగులు వేసింది. అనివార్య కారణాల వల్ల ఆగుతూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికకు ఏడాదిన్నర మాత్రమే సమయం ఉంది. దీంతో రాజధానుల విషయం గురించి ప్రభుత్వం ముందడుగు వేయడం లేదు. కానీ ప్రముఖులు కామెంట్ చేస్తే మాత్రం స్వాగతిస్తూ వస్తున్నారు. ఇప్పటికిప్పుడు రాజధానుల దిశగా అడుగులు వేస్తే.. ఏమైనా ప్రతికూలత ఏర్పడుతుందా అనే సందేహాం అధికార పార్టీలో నెలకొంది. అందుకోసమే ఆచితూచి స్పందిస్తోంది.