Rice: బియ్యం కోసం క్యూ కట్టిన జనాలు..భారీగా పెరిగిన ధర
దేశీయ ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి బాస్మతీయేతర తెల్ల బియ్యం(rice) ఎగుమతులను భారతదేశం(india) విదేశాలకు నిషేధించింది. దీంతో అమెరికాలో 18 డాలర్లు ఉన్న రైస్ బ్యాగ్ రేటు కాస్తా 50 డాలర్లకు చేరింది. ఈ క్రమంలో వినియోగదారులు షాపింగ్ మాల్స్ వద్ద పెద్ద ఎత్తున ఎగబడ్డారు.
ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం(rice) ఎగుమతిదారు అయిన భారతదేశం(india) దేశీయ ధరలను అదుపులో ఉంచే ప్రయత్నంలో భాగంగా గురువారం అర్థరాత్రి “బాస్మతీయేతర తెల్ల బియ్యం” అన్ని ఎగుమతులను విదేశాలకు నిషేధించింది. దేశీయ మార్కెట్లో ధరల పెరుగుదలను తగ్గించడానికి ఈ చర్య తీసుకున్నట్లు భారత ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశంలో బియ్యం ధరలు గత ఏడాది కంటే 11.5%, గత నెలలో 3% పెరిగాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు బార్ పాయిల్డ్ నాన్ బాస్మతి, బాస్మతి రైస్ ఎగుమతి విధానంలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది.
భారతదేశం ప్రపంచంలోని బియ్యం ఎగుమతి రవాణాలో 40% వాటాను కలిగి ఉంది. 2022లో దేశం రికార్డు స్థాయిలో 22.2 మిలియన్ టన్నులను ఎగుమతి(export) చేసింది. ఈ నిషేధంతో భారతదేశంపై ఆధారపడ్డ పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్‌తో పాటు బెనిన్, అంగోలా, కామెరూన్, జిబౌటి, గినియా, ఐవరీ కోస్ట్, కెన్యా వంటి అనేక ఆఫ్రికన్ దేశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతోపాటు అమెరికా, బ్రిటన్ వంటి పలు దేశాల్లో ఉంటున్న భారతీయులపై కూడా ఎఫెక్ట్ కనిపిస్తుంది. గతంలో అమెరికాల 18 డాలర్లు ఉన్న రైస్ బ్యాగ్ కాస్తా ప్రస్తుతం 50 డాలర్లకు పెరిగింది. దీంతో వినియోగదారులు రైస్ బ్యాగ్స్ కొనుగోలు చేసేందుకు షాపింగ్ మాల్స్ వద్దకు పెద్ద ఎత్తున చేరారు. క్యూ లైన్లో నిలబడి మరి రైస్ బ్యాగ్స్ అయిపోతాయనే భయంతో కొనుగోలు చేస్తున్నారు.
వరి(paddy) పంటలపై ఎల్‌నినో ప్రభావం చూపుతుందన్న భయాలు కూడా ధాన్యం కోసం అంతర్జాతీయ ధరలను రెండేళ్ల గరిష్ట స్థాయికి పెంచాయని అనలిటిక్స్ సంస్థ గ్రో ఇంటెలిజెన్స్ నివేదించింది. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం మధ్య నల్ల సముద్రం గుండా ఉక్రేనియన్ ఆహార ధాన్యాలను సురక్షితంగా తరలించడానికి అనుమతించే కీలక ఒప్పందాన్ని రష్యా రద్దు చేసిన కొన్ని రోజుల తర్వాత భారతదేశం ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్ గోధుమ, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు నూనె ప్రధాన ప్రపంచ సరఫరాదారుగా ఉన్నందున, ఈ చర్య ప్రపంచ ఆహార భద్రతపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు.