Locals panic as teenager dies of deadly bacteria Niegleria floweri in Kerala
కేరళ(Kerala)లో రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన వింత వ్యాధి కేసులో చికిత్స పొందుతున్న కుర్రాడు మరణించాడు. ఈ వార్తతో కేరళలోని అలప్పుజ ప్రాంత వాసులు భయాందోళనలకు గురి అవుతున్నారు. నైగ్లీరియా ప్లవరీ(Niegleria floweri) అనేది బాక్టీరియా మూలాన మనుషుల్లో వచ్చే ప్రాణంతకమైన వ్యాధి. ఈ బాక్టీరియా(Bacteria) మనిషిలో ప్రవేశించగానే మొదడు పనితీరుపై దాడిచేస్తుంది. అయితే ఈ బ్యాక్టీరియా నీటిలో ఉంటుంది. కంటికి కనిపించదు. ఇక శరీరంలోకి ప్రవేశించగానే గంటల వ్యవధిలోనే మొదడుకు వ్యాపిస్తుంది. కేరళలో అలప్పుజ ప్రాంతంలో నివసించే ఓ 15ఏళ్ల కుర్రాడు సరదాగా స్నేహితులతో వాగులో ఈతకు వెళ్లాడు. ఇంటికి వచ్చిన తరువాత కాసేపటికే అస్వస్థతకు గురయ్యాడు. కంగారు పడిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.
కుర్రాడిని పరిశీలించిన వైద్యులు అతనికి ప్రాణంతకమైన బాక్టీరియా సోకింది అని నిర్ధారించారు. సాధ్యమైనంత వరకు ప్రయత్నించారు. కానీ చివరికి బాలుడిని కాపాడలేకపోయారు. ఈ బాక్టీరియా బాడీలోకి ప్రవేశించిందటే మనిషి చనిపోవడం ఖాయం అని డాక్టర్లే అభిప్రాయపడుతారు. ఈ వ్యాధి సోకిన వారిలో 97 శాతం మంది ప్రాణాలు కోల్పోయారంటే ఇది ఎంత డేంజరో అర్ధం చేసుకోండి. ఇంత ప్రాణాంతక వ్యాధి సోకితే తలముందు భాగంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. జ్వరం, గొంతు మంట, వికారం, వాంతులు, మెడ పట్టేయడం, మూర్ఛ రావడం వంటి లక్షణాలు ఉంటాయి.
కలుషిత నీటిలో ఉన్నప్పుడు చెవి లేదంటే ముక్కు ద్వారా ఇది శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది అంటువ్యాధి కాదు. కేరళ అలప్పుజ ప్రాంతంలో 2016లో ఈ వ్యాధిని మొదటిసారి గుర్తించారు. 2019, 2020లో మలప్పురంలో 2 కేసులు నమోదయ్యాయి. 2022లో త్రిసూర్‌లో ఒక కేసు రికార్డు అయింది. భారతదేశంలో ఇప్పటివరకు 5 కేసులు నమోదు అయినట్లు తెలుస్తుంది. ఈ వ్యాధి బారిన ఎవరు పడకుండా ఉండాలంటే మురుగు నీటిలో మొహం, కాళ్లు కడుక్కోవడం మానేయాలి. ఇంటి చుట్టుపక్కల కూడా అపరిశుభ్రమైన నీటిని లేకుండా చేసుకోవాలి అని నిపుణులు అంటున్నారు.