నెల్లూరు జిల్లా కుందుకూరు లో నిర్వహించిన చంద్రబాబు సభ విషాదం నింపింది. సభ సమయంలో తొక్కిసలాట జరిగి.. దాదాపు 8మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా… ఈ ఘటనపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్ వల్లే… వారంతా ప్రాణాలు కోల్పోయారని కొడాలి నాని మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపించారు.
ఇరుకు సందుల్లో సభలు వద్దని స్థానిక నాయకులు చెప్పినా వినకుండా పబ్లిసిటీ స్టంట్ కోసం కందుకూరులో చంద్రబాబు సభ నిర్వహించారన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. ఫలితంగా 8 మంది అమాయకులు మృతిచెందారని.. ఇప్పటికైనా ప్రచార పిచ్చి తగ్గించుకో బాబూ అంటూ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
కేవలం కొడాలి నాని మాత్రమే కాదు.. పలువురు వైసీపీ నేతలు కూడా చంద్రబాబు ని విమర్శించడం గమనార్హం. చంద్రబాబు అధికార దాహం వల్లే కందుకూరు ప్రమాదం జరిగిందన్నారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. లేనిది ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేశారని.. ఎనిమిదిమందిని పొట్టనబెట్టుకున్నారన్నరు. సభకు వస్తే కూలి ఇస్తారని వచ్చినవాళ్లే ప్రాణాలు కోల్పోయారన్నారు. ఎక్కువమంది వచ్చారని చూపించడం కోసమే ఇదంతా చేశారని.. ఎన్ని పొరపాట్లు చేయకూడదో అన్ని పొరపాట్లు చంద్రబాబు చేశారన్నారు. ఇరుకు సందులో సభ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. సిగ్గూ శరం లేని వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు.
గతంలో గోదావరి పుష్కరాల సమయంలో కూడా 29మంది ప్రాణాలను మరణానికి కారణమయ్యారన్నారు. డ్రోన్ షాట్ల కోసం జనాలు బలవంతంగా తరలించి సభ పెట్టారన్నారు. జగన్ సభలకు అంతమంది జనాలు వచ్చినా చిన్న ఘటన కూడా జరగలేదన్నారు. చంద్రబాబు ఇంకా ఒకసారి అవకాశం ఇవ్వమని అడుగుతుంటే ఎంత దిగజారరో అర్ధమవుతుందన్నారు. ఇవి చంద్రబాబు చేసిన హత్యలని.. ఆయన రాష్ట్రంలో పుట్టడమే ఖర్మ అన్నారు. చంద్రబాబుపై కేసు పెట్టాలన్నారు.