డ్రాగన్ కంట్రీ చైనాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా ప్రయాణీకులకు కోవిడ్ కొత్త రూల్స్‌ను అమల్లోకి తీసుకు వస్తోంది. కరోనా వైరస్ BF7 చైనాలో కల్లోలం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఒక వేరియంట్ కాదని, నాలుగు వైరస్ వేరియంట్స్ కారణంగా చైనా కరోనాతో అతలాకుతలమవుతోందని వెల్లడైంది. చైనా అధికారిక డేటా ప్రకారం ఇప్పటి వరకు 4 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా, తాజాగా 5231 కేసులు వెలుగు చూశాయి. మొత్తం మరమాలు 5245. అయితే బీజింగ్ నుండి పారదర్శక డేటా లేదనే ఆందోళనలు మొదటి నుండి ఉన్నాయి.
ప్రాణాంతక కరోనా విషయంలో చైనా డేటా పారదర్శకంగా లేకపోవడంతో, అక్కడి నుండి వచ్చే ప్రయాణీకులకు కరోనా నిబంధనలు విధించాలని అమెరికా నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. చైనా నుండి వచ్చే ప్రయాణీకులపై జపాన్, భారత్, మలేషియా గత ఇరవై నాలుగు గంటల్లో కఠిన నిబంధనలు ప్రవేశపెట్టిన తర్వాత అమెరికా కూడా అదే బాటలో నడవనుంది. చైనాలో కేసులు రోజుకు లక్షల్లో పెరుగుతున్నాయి. చైనా నుండి వచ్చే ప్రయాణీకులకు కోవిడ్ 19 పరీక్ష నెగిటివ్ అవసరమని జపాన్ వెల్లడించింది. మలేషియా అదనపు ట్రాకింగ్, నిఘా చర్యలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు కోవిడ్ కొత్త రూల్స్ తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.