ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో డబులు డెక్కర్ బస్సులు చాలా ఉండేవి. కానీ.. తర్వాతర్వాత అవి కనుమరుగైపోయాయి. అయితే… ఇప్పుడు మళ్లీ ఆ బస్సులు నగరంలో సందడి చేయనున్నాయి. ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా అధునాతన టెక్నాలజీతో కూడిన డబులు డెక్కర్ బస్సులను ప్రారంభించాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. లగ్జరీ బస్సలు మాదిరిగా వీటిని అందుబాటులోకి తీసుకువస్తుండటం గమనార్హం.
ఇరవై ఏళ్ళ కిందటి వరకు హైదరాబాద్లో డబుల్ డెక్కర్ బస్సులు కీలక పాత్ర పోషించాయి. అప్పట్లోనే నగరవాసుల రద్దీని తట్టుకునేందుకు ప్రధాన రూట్లలో డబుల్ డెక్కర్ బస్సులను నడిపింది ఆర్టీసీ .
ఈ డబుల్ డెక్కర్ బస్సులు ప్రయాణికుల విశేష ఆదరణ పొందాయి. కాలక్రమేణా ఈ బస్సులు అంతరించి పోయాయి. పలు కారణాలతో డబుల్ డెక్కర్ సేవలను ఆర్టీసీ నిలిపివేసింది. అయితే కొద్ది నెలల క్రితం ఓ నెజిటన్ హైదరాబాద్లో డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి ప్రారంభించే అంశంపై ఆలోచించాలని ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్కు విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన ఆర్టీసీ అధికారులు త్వరలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయోగాత్మకంగా 10 డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ప్రయోగాత్మకంగా హైదరాబాద్లో 10 డబుల్ డెక్కర్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. గతంలో డబుల్ డెక్కర్ బస్సులు నడిచిన రూట్లలో తిరిగి ప్రారంభిస్తే ఎలా ఉంటుందనే విషయంపై దృష్టి సారించారు అధికారులు.