తమిళనాడు(Tamil Nadu)లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. చెన్నై(Chennai) వ్యాప్తంగా గత రాత్రి వాన కురిసింది. పలు ప్రాంతల్లో బడులకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.రాత్రిపూట భారీ వర్షంతో తమిళనాడులోని కొన్నిప్రాంతాలు అతలాకుతలమయ్యాయి.నిన్న ఉదయం 8.30 నుంచి నేటి ఉదయం 5.30 గంటల మధ్య మీనంబాక్కమ్(Meenambakkam)లో రికార్డుస్థాయిలో 137.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.నేడు కూడా తమిళనాడు, పుదుచ్చేరి(Puducherry), కరైకల్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మాదిరి వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది.
కాంచీపురం(Kanchipuram), చెంగల్పట్టు, తిరువన్నామలై, కళ్లకురిచి, విల్లుపురం, కడలూర్, మైలాదుతురై, నాగపట్టణం, తిరువారూర్, తంజావూర్, తిరుచ్చి, అరియలూర్, పెరంబలూర్(Perambalur)తోపాటు పుదుచ్చేరి, కరైకుల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూర్, రాణిపేట్ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. చెన్నై, దాని శివార్లలోని అనేక ప్రాంతాలలో ప్రజలు వరదమయమైన వీధుల్లో ఇబ్బందులు పడుతున్నారు.చెన్నై నుంచి బయల్దేరాల్సిన 12కుపైగా అంతర్జాతీయ విమనాలకు ఆలస్యమయింది. చెన్నపట్నానికి రావాల్సిన ఆరు విమానాలను బెంగళూరుకు దారిమళ్లించారు.