టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తెలంగాణ(Telangana)లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎంత శాతం ఓట్లు వస్తాయో రేవంత్ శుక్రవారం మీడియాతో చిట్ చాట్ సందర్భంగా తెలిపారు. పార్టీల వారీగా ఇటీవల నిర్వహించిన సర్వే వివరాలు అంటూ ఆయన వెల్లడించారు. ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీకి 37 శాతం, కాంగ్రెస్(Congress) కు 34 శాతం, బీజేపీకి 14 శాతం ఓట్లు వస్తాయన్నారు.
బీఆర్ఎస్ (BRS)కు 45 సీట్లు, కాంగ్రెస్ కు 45, బీజేపీ(BJP)కి 7 , మజ్లిస్ పార్టీకి 7 సీట్లు వచ్చే అవకాశముందన్నారు. మరో పదిహేను స్థానాల్లో గట్టి పోటీ కనిపిస్తోందని వెల్లడించారు. గతంలో 24 శాతంగా ఉన్న బీజేపీ ఓటు బ్యాంకు ఇప్పుడు 14 శాతానికి పడిపోయిందన్నారు. ఎన్నికల నాటికి పరిస్థితిలో మరింత మార్పు వస్తుందన్నారు. కొడంగల్ (Kodangal)మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.ఇప్పటికే రాష్ట్రంలో బీఆర్ఎస్ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చిందని.. తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారంటూ చెప్పుకొచ్చారు.