HMDA Notice: ఓఆర్ఆర్ లీజు ఇష్యూపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన స్వరం మరింత పెంచారు. అక్రమాలు జరిగాయని పదే పదే ఆరోపణలు చేయగా.. గత నెల 25వ తేదీన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ లీగల్ నోటీసు పంపించారు. ఆ అంశంపై ఈ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడారు. తనకు ఇచ్చిన లీగల్ నోటీసు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తే.. నోటీసులు ఇస్తారా అని మండిపడ్డారు. ఆ నోటీసులో పేర్కొన్న ఆరోపణలు అన్నీ అవాస్తవం అని తేల్చిచెప్పారు.
ఓఆర్ఆర్ టెండర్ ఇష్యూలో అరవింద్ కుమార్ ఐఏఎస్ అధికారిలా వ్యవహరించడం లేదని రేవంత్ రెడ్డి (Revanth Reddy) మండిపడ్డారు. ఓ రాజకీయ నేతగా బిహేవ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. అడిగిన సమాచారం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి రూ.7380 కోట్లకు ఐఆర్బీ కంపెనీకి 30 ఏళ్లకు ఓఆర్ఆర్ టోల్ వసూల్ టెండర్ అప్పగించారని పేర్కొన్నారు. టెండర్ ఇచ్చే క్రమంలో నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. బేస్ ప్రైస్ గురించి ఎందుకు చెప్పడం లేదని సూటిగా ప్రశ్నించారు. ఓఆర్ఆర్పై ట్రాఫిక్, టెండర్ విలువను మదింపు చేసిన మజర్స్ నివేదికను పబ్లిన్ డొమైన్లో ఎందుకు పెట్టడం లేదని మరోసారి అడిగారు. ఐఏఎస్ అధికారి స్థానంలో ఓ రిటైర్డ్ ఆఫీసర్‌ను నియమించి టెండర్ ప్రక్రియ పూర్తి చేశారని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. ఓఆర్ఆర్ టెండర్‌పై ఎన్ని నోటీసులు ఇచ్చినా సరే.. ప్రజల తరఫున పోరాడుతామని స్పష్టంచేశారు.
ఓఆర్ఆర్ టెండర్ లీజుపై రేవంత్ (Revanth) చేసిన ఆరోపణలను హెచ్ఎండీఏ సీరియస్‌గా తీసుకుంది. ప్రజలను తప్పుదోవ పట్టించుకేందుకు రేవంత్ అబద్దాలు చెప్పారని లీగల్ నోటీసు జారీచేసింది. నోటీసు అందిన 48 గంటల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓఆర్ఆర్ను లీజుకు తీసుకున్నామని హెచ్ఎండీఏ పేర్కొంది. గత ఏడాది నవంబర్ 9వ తేదీన టీవీఓటీ టెండర్ నోటీపికేషన్ జారీచేసింది.. అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానించేందుకు టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని తెలిపింది. అత్యధిక బిడ్ దాఖలు చేసిన ఐఆర్బీ ఇన్ ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్‌కు లీజు ఖరారు చేస్తూ ఏప్రిల్ 27వ తేదీన లెటర్ ఆఫ్ అవార్డ్ ఇచ్చింది. దీనికి సంబంధించిన అన్ని అంశాలు ఆన్ లైన్లో అందుబాటులో ఉన్నాయని చెప్పింది. సమాచారం ఉన్నప్పటికీ లేదని.. అబద్దాలు ఆడుతున్నారని నోటీసుల్లో హెచ్ఎండీఏ పేర్కొంది. ఆ నోటీసులపై రేవంత్ రెడ్డి స్పందించారు.