Zelensky Own Town Kryvyi: ఉక్రెయిన్ లక్ష్యంగా రష్యా దాడులకు తెగబడుతూనే ఉంది. సోమవారం అర్ధరాత్రి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) సొంత గడ్డ క్రైవీ రిహ్ లక్ష్యంగా క్షిపణి దాడులతో తెగబడింది. దీంతో ఐదు అంతస్తుల అపార్ట్ మెంట్ భవనం, పలు ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకొని ఉండొచ్చని నగర మేయర్ పేర్కొన్నారు. దాడికి సంబంధించి ఫోటోలను డెనిప్రో పెట్రోవ్క్స్ గవర్నర్ షెర్హీలిసాక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
రష్యా (Russia) క్షిపణి దాడుల్లో ముగ్గురు చనిపోగా.. 25 మంది గాయపడ్డారు. ఐదు అంతస్తుల భవనం మంటల్లో చిక్కుకొని ఉంది. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కీవ్‌పై రష్యా దాడులు చేసింది. నగరానికి రక్షణగా ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పలు మిసైల్స్ కూల్చివేసిందని కీవ్ మిలిటరీ రీజియన్ ప్రతినిధులు తెలిపారు. ఉక్రెయిన్ (ukraine) రాజధాని కీవ్ సహా పలు నగరాల్లో మొత్తం గగనతల రక్షణ వ్యవస్థ సైరన్ మోగుతూనే ఉంది.
ఖర్కీవ్‌పై డ్రోన్ దాడులు జరిగాయని నగర మేయర్ ధృవీకరించారు. పౌర నివాసాలపై రష్యా డ్రోన్లు దాడి చేశాయని తెలిపారు. కైవ్ స్కీ జిల్లాలో ఓ కంపెనీ, సాల్టివిస్కీ జిల్లాలో ఓ గోడైన్ దెబ్బతింది. రష్యా దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (zelensky) ఖండించారు. ప్రజలు నివసించే భవనాలపై యుద్ధం ప్రకటించారని మండిపడ్డారు. ఆత్మీయులు కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షిపణులు ప్రయోగించిన వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.