»Former Twitter Ceo Dorsey Said That Their Accounts Were Blocked Because The Government Told Them To
Jack Dorsey: ప్రభుత్వం చెప్పినందుకే వాళ్ల అకౌంట్స్ బ్లాక్ చేశాం..పూర్తిగా అబద్ధమన్న కేంద్రం
మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ పై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలోనే పలువురు ఖాతాలు బ్లాక్ చేశామని ట్విట్టర్ మాజీ సీఈఓ జాక్ డోర్సే(Jack Dorsey) పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి సైతం స్పందించారు.
ట్విట్టర్ మాజీ సీఈఓ జాక్ డోర్సే(Jack Dorsey) ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించారు. ఇండియాలో ప్రతిపక్షాలకు చెందిన అనేక ట్విటర్ ఖాతాలను బ్లాక్ చేయాలని అధికార ప్రభుత్వమే చెప్పిందని పేర్కొన్నారు. అయితే రైతుల నిరసనల సమయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వారి ఖాతాలను బ్లాక్ చేయమని ప్రభుత్వం నుంచి ట్విట్టర్‌కు అభ్యర్థనలు వచ్చినట్లు స్పష్టం చేశారు. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాల విషయంలో విపక్షాలు సహా అనేక మంది ట్విట్టర్ వేదికగా నిరసన వ్యక్తం చేస్తూ తీవ్రంగా అధికార బీజేపీ ప్రభుత్వంపై రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు, పోస్టులు చేసినట్లు గుర్తు చేశారు. ఒకనొక క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురి ఖాతాలను బ్లాక్ చేసినట్లు చెప్పారు.
మరోవైపు పలువురు ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్‌ను మూసివేస్తామని, ఉద్యోగుల ఇళ్లపై దాడులు చేస్తామని పలువురు బెదిరించినట్లు కూడా పేర్కొన్నారు. భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఈ చర్యలు జరిగాయని డోర్సీ గుర్తుచేసుకున్నారు. దీంతోపాటు భారతదేశం(india) వలె టర్కీ దేశం కూడా చేసినట్లు చెప్పారు. టర్కీ ప్రభుత్వం కూడా ట్విట్టర్‌ను బెదిరించిందని ఆరోపించారు. ఇలా తరచుగా అనేక ప్రభుత్వాల నుంచి ఆదేశాలు తాము ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు.
అయితే డోర్సే ఆరోపణలపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్(rajeev chandrasekhar) స్పందించారు. ఇది పూర్తిగా అబద్ధం. @twitter భారత చట్టాన్ని పదేపదే ఉల్లంఘించిందని స్పష్టం చేశారు. జాతీయ, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిషేధాజ్ఞలు జారీ చేశామని, హత్యలు, మూక హింసను నిరోధించేందుకు చర్యలు తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.