2024లో గెలుపే లక్ష్యంగా బీజేపీ (BJP) ఇప్పటి నుంచి ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది.
దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ (PM MODI) బాధ్యతలు స్వీకరించి నవ వసంతాలు పూర్తయిన సందర్భంగా బీజేపీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో సాధించిన విజయాలు, చేరుకున్న లక్ష్యాలను ప్రజలకు వివరించేలా ప్రత్యేక కార్యచరణను ప్రకటించింది. . 2019లో బీజేపీ (BJP) పోటీ చేసిన స్థానాలు 437 కాగా గెలిచినవి 303. మరి మిగిలిన 144 స్థానాల్లో ఓటమికి గల కారణాలు ఏంటి? ఆయా నియోజకవర్గాల్లో గెలుపు కోసం అమలు చేయాల్సిన వ్యూహాలు ఏంటి? 144 స్థానాల్లో ‘పక్కా లోకల్ స్కెచ్’ తో సరికొత్త ఆపరేషన్ ను మొదలు పెట్టనుంది బీజేపీ (BJP). ఇందుకోసం స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ రంగంలోకి దిగనున్నారు. 2024 ఎన్నికలు లక్ష్యంగా రూపొందించిన కార్యక్రమాల వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ (Tarun Chugh) ఢిల్లీలో మీడియాకు తెలిపారు. ‘సేవా, సుపరిపాలన, పేదల సంక్షేమం’ పేరుతో దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రచారం చేపట్టబోతున్నట్టు తరణ్ చుగ్ అన్నారు. రేపు రాజస్థాన్ లోని అజ్మీర్ (Ajmer) నుంచి ప్రచార ర్యాలీని ప్రధాని ప్రారంభిస్తారని, ఈ ర్యాలీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షా సహా పలువురు కేబినెట్ మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు హాజరు అవుతాలని వెల్లడించారు.
అన్ని ప్రాంతాల రిపోర్ట్ కార్డుతో ప్రజలు, మీడియా ముందుకు వెళ్లబొతున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 500 పైగా భారీ సభలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఈ క్రమంలో 5 లక్షల మంది ప్రముఖులు, స్వాతంత్ర సమరయోధులు దగ్గరకు పార్టీ నేతలు, ఎంపీలు వెళ్తారని తెలిపారు. 44 క్లస్టర్ల విభజించి ప్రతి క్లస్టర్ లో 3 నుంచి 4 లోక్ సభ (Lok Sabha) స్థానాలు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసింది. క్లస్టర్ల వారీగా 9 ఏళ్ల పాలనపై ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. జూన్ 3 నుంచి జూన్ 30 వరకు బూత్ స్థాయిలో ప్రతి ఇంటికి బీజేపీ శ్రేణులు వెళ్తాయని చెప్పారు. యువత, మహిళలు ఇలా అన్ని రంగాల ప్రజలను చేరువ అయ్యేవిధంగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 10 లక్షల మంది కార్యకర్తలతో డిజిటల్ ర్యాలీ (Digital Rally) నిర్వహించాలని తలపెట్టారు. దీనిలో ప్రధాని మోడీ హాజరు అవుతారని తరుణ్ చుగ్ వెల్లడించారు.