»Brs Party All Set To Ap Brs Party Office Opening On May 20th In Guntur
APలో దూకుడే.. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం సిద్ధం.. ముహూర్తం ఖరారు?
తాత్కాలికంగా అద్దె లేదా లీజు ప్రాతిపదికన ఐదంతస్తుల భవనాన్ని తీసుకున్నారని సమాచారం. మొదటి అంతస్తులో పార్టీ కార్యకర్తలతో సమావేశ మందిరం, రెండు, మూడు అంతస్తుల్లో పరిపాలన విభాగం, ఐదో అంతస్తులో పార్టీ అధ్యక్షుడి కార్యాలయం ఏర్పాటుచేశారు.
జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే మహారాష్ట్రలో (Maharashtra) దూకుడుగా వెళ్తున్న బీఆర్ఎస్ (Bharat Rashtra Samithi) మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోనూ అడుగుపెట్టబోతున్నది. పార్టీ కార్యాలయాలను కూడా సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే ఢిల్లీలో (Delhi) శాశ్వత కార్యాలయం ఏర్పాటవగా.. మహారాష్ట్రలో రెండు మూడు చోట్ల కార్యాలయాలు ప్రారంభించేందుకు ప్రణాళికలు వేసింది. ఇక పక్క రాష్ట్రం ఏపీలో కూడా కార్యాలయం (Party Office) ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది.
ఏపీలో బీఆర్ఎస్ దూకుడు పెంచుతోంది. ఇప్పటికే అక్కడి అధికార పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న పార్టీ.. ఇకపై మరింత దూకుడుతో ముందుకెళ్లనుంది. ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యాలయాన్ని ఏపీలో ప్రారంభించడానికి సిద్ధమైంది. ఇకపై నేరుగా పార్టీ కార్యాకలాపాలు బీఆర్ఎస్ ఏపీ విభాగం (AP BRS) చూసుకోనుంది. ఈ కార్యాలయం నుంచే కార్యాచరణ సిద్ధం చేయనుంది. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఎంపిక పూర్తయి ప్రారంభానికి ముహూర్తం కూడా ఖరారైందని సమాచారం.
ఏపీ అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ తోట చంద్రశేఖర్ (Thota Chandrasekhar) పార్టీ కార్యాలయం ఏర్పాటుపై తీవ్ర ప్రయత్నాలు చేశారు. పలుచోట్ల స్థలాలు, భవనాలు పరిశీలించారు. చివరకు గుంటూరు (Guntur) పట్టణం ఆటోనగర్ ప్రాంతంలో ఓ భవనాన్ని కార్యాలయం కోసం ఎంపిక చేశారు. తాత్కాలికంగా అద్దె లేదా లీజు ప్రాతిపదికన ఐదంతస్తుల భవనాన్ని తీసుకున్నారని సమాచారం. మొదటి అంతస్తులో పార్టీ కార్యకర్తలతో సమావేశ మందిరం, రెండు, మూడు అంతస్తుల్లో పరిపాలన విభాగం, ఐదో అంతస్తులో పార్టీ అధ్యక్షుడి కార్యాలయం ఏర్పాటుచేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఈనెల 21న ఆదివారం 11.35 శుభ ముహూర్తమున ఏపీలో బీఆర్ఎస్ తొలి కార్యాలయం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు (Ravela Kishore Babu) తదితరులతో పాటు తెలంగాణలోని ముఖ్య నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది.
కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం బీఆర్ఎస్ ఏపీలో కార్యాచరణ (Action) సిద్ధం చేయనుంది. అధికార పార్టీపై పోరాడుతూనే రాష్ట్రంలో పార్టీ విస్తరణపై అధిష్టానం ఆదేశాల మేరకు కార్యక్రమాలు చేపట్టనుంది. పార్టీ అధినేత కేసీఆర్ ఆశీస్సులు, ఆదేశాలతో ఏపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ పార్టీని ముందుండి నడిపించనున్నారు.