‘Physical assault, extra-marital relations’: Mohammed Shami’s wife moves SC
Mohammed Shami’s wife moves SC:టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీపై (Mohammed Shami) అతని భార్య హాసిన్ జహాన్ (Hasin Jahan) మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. అతని అరెస్ట్ వారెంట్‌పై కోల్ కతా హైకోర్టు కూడా స్టే విధించిన సంగతి తెలిసిందే. దీనిని ఆమె సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో (supreme court) సవాల్ చేశారు. షమీపై నమోదైన క్రిమినల్ కేసుకు సంబంధించిన విచారణలో నాలుగేళ్లుగా ఎలాంటి పురోగతి లేదని స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. షమీ అరెస్టు వారెంట్ పై స్టే ఎత్తివేయాలని కోరారు.
తాము కలిసి ఉన్న సమయంలో షమీ (shami) కొట్టేవాడని.. ఇప్పటికీ అతనికి వివాహేతర సంబంధాలు ఉన్నాయని వివరించారు. అదనపు కట్నం గురించి వేధించేవాడని పేర్కొన్నారు. బీసీసీఐ తరఫున టూర్ వెళ్లే సమయంలో అతనికి ఇచ్చిన ప్రత్యేక గదుల్లో ఇప్పటికీ షమీ వివాహేతర సంబంధాలు కొనసాగిస్తాడని జహాన్ ఆరోపించారు. తనను, తన కుటుంబాన్ని వేధించాడని మరోసారి తెలిపారు.
హసీన్ జహాన్‌ను షమీ 2014లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె ఉంది. షమీ తనను హింసిస్తున్నాడని 2018లో కోల్ కతాలో గల జాదవ్ పూర్ పోలీస్ స్టేషన్లో హసీన్ ఫిర్యాదు చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. 2019 ఆగస్టులో అలిపోర్ కోర్టు షమీపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీనిని సెషన్స్ కోర్టులో షమి సవాల్ చేయగా.. అరెస్ట్ వారెంట్, విచారణ ప్రక్రియపై స్టే విధిస్తూ సెప్టెంబర్‌లో కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీనిని కోల్ కత్తా హైకోర్టులో హసీన్ సవాల్ చేశారు. షమీ అరెస్టు వారెంట్ పై స్టే ఎత్తివేయాలని కోరగా.. అందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.