ఏపీలో రాజకీయాలు హీటెక్కిపోతున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదనలు పెరిగిపోతున్నాయి. తాజాగా…. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి విమర్శల వర్షం కురిపించారు.
ట్విట్టర్ వేదికగా ఘాటు విమర్శలు చేశారు. ప్రియమైన చంద్రం అన్నయ్యా! అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ మొదలు పెట్టారు. చంద్రబాబును ఏ ఏ ప్రాంతాల ప్రజలు ఛీ కొట్టారో వివరించారు. ఎంత మంది ఛీ కొట్టినా ఎల్లో మీడియా అండగా ఉంది అంటూ ట్వీట్ ముగించారు. పొమ్మంది, తరిమింది, ఉమ్మేసింది అంటూ లయబద్ధమైన పదాలను తన ట్వీట్లో విజయసాయిరెడ్డి వాడారు.
చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అనేక చోట్ల వైసీపీ నాయకుల నుంచి నిరసనలు ఎదుర్కొంటున్నారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. వీటన్నిటినీ తట్టుకుని చంద్రబాబు తన పర్యటనను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
‘ప్రియమైన చంద్రం అన్నయ్యా!
మొదట్లోనే నిన్ను చంద్రగిరి ఛీ పొమ్మంది. ఆ తరవాత హైదరాబాద్ తన్ని తరిమింది. ఇంతకు ముందే ఉత్తరాంధ్ర ఉమ్మేసింది. ఇప్పుడు రాయలసీమ కూడా నిన్ను గో బ్యాక్ అంటోంది! అయినా సిగ్గుపడకు అన్నయ్యా…ఎల్లో కుల మీడియాలో నీకు కావాల్సినంత ప్లేస్ ఉంది!’ అంటూ ట్వీట్ చేశారు.