దాదాపు మూడు టక్కుల నిండా పట్టే నాణేలు ఉన్నాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అయితే నాణేల బరువుకు పైకప్పు కూలిపోతుందేమోనని భవనంలోని ఇతర దుకాణాదారులు భయాందోళన చెందుతున్నారు.
ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందిన మందిరం షిర్డీ (Shirdi). సాయినాథుడు నడయాడిన నేల కావడంతో షిర్డీకి భక్తులు, సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. నిత్యం వేలాది సంఖ్యలో ప్రజలు తరలివస్తుండడంతో మహారాష్ట్రలోని (Maharashtra) షిర్డీ క్షేత్రం రోజూ కిటకిటలాడుతుంది. తిరుమల కన్నా అత్యధికంగా షిర్డీ క్షేత్రానికి భక్తులు (Devotees) తరలివస్తుంటారు. అలాంటి షిర్డీ ఆలయానికి ‘చిల్లర’ కష్టం వచ్చి పడింది భక్తులు సమర్పిస్తున్న నాణేలతో బ్యాంకులన్నీ నిండిపోయాయి. చిల్లరతో బ్యాంకులు నిండిపోవడంతో భక్తులు వేస్తున్న నాణేలను బ్యాంకుల్లో డిపాజిట్ చేయలేని పరిస్థితి. దీంతో ఏం చేయాలో పాలుపోక షిర్డీ సంస్థాన్ (Shri Saibaba Sansthan Trust -SSST) మల్లగుల్లాలు పడుతోంది.
ఆలయాన్ని సందర్శించిన సమయంలో భక్తులు హుండీల్లో వేస్తున్న నాణేలు (Coins) కొండలాగా పేరుకుపోతున్నాయి. వారంలో రెండు సార్లు హుండీని (Hundi) లెక్కిస్తారు. ఆ వచ్చిన నగదును షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ బ్యాంకుల్లో (Banks) జమ చేస్తుంది. అయితే షిర్డీ సంస్థాన్ కు 10కి పైగా బ్యాంకులతో పాటు నాసిక్ లోని ఓ జాతీయ బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి. వచ్చిన నగదును వచ్చినట్టు బ్యాంకుల్లో జమ చేస్తున్న షిర్డీ సంస్థాన్ కు చిల్లర కష్టాలు ఎదురయ్యాయి. ప్రస్తుతం ఒక్కో బ్యాంకు వద్ద దాదాపు రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల నాణేలు నిల్వ ఉన్నాయి. దీంతో బ్యాంకుల్లో నాణేలను నిల్వ చేయడానికి స్థలం కొరత ఏర్పడింది. ఛత్రపతి కాంప్లెక్స్ మొదటి అంతస్తులోని కెనరా బ్యాంకులోని (Canara Bank) స్ట్రాంగ్ రూమ్ నాణేలతో నిండిపోయింది. దాదాపు మూడు టక్కుల నిండా పట్టే నాణేలు ఉన్నాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అయితే నాణేల బరువుకు పైకప్పు కూలిపోతుందేమోనని భవనంలోని ఇతర దుకాణాదారులు భయాందోళన చెందుతున్నారు. దీంతో బ్యాంకులు నాణేలు నిరాకరిస్తున్నాయి. ‘చిల్లర సమస్య మాకు పెద్ద ఇబ్బందిగా ఉంది’ అని ఆలయ ట్రస్ట్ రాహుల్ జాదవ్ తెలిపారు.
ఈ చిల్లర కష్టాలు తీవ్రమవుతుండడంతో షిర్డీ సంస్థాన్ ప్రత్యమ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది. దాదాపు 11 బ్యాంకుల్లో నాణేలతో నిండిపోవడంతో మరో బ్యాంకులో ఖాతా (Bank Account) తెరవాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. త్వరలోనే బ్యాంకు ఖాతా తెరచి అక్కడ నాణేలు జమ చేసేందుకు సిద్ధమయ్యారు. దేశవ్యాప్తంగా నాణేల కొరత ఏర్పడుతుంటే షిర్డీ ఆలయంలో మాత్రం టన్నులకు టన్నులు నాణేలు పడి ఉన్నాయి. కాగా ఆలయానికి సంబంధించిన డిపాజిట్లు దాదాపు రూ.2,600 కోట్లు బ్యాంకుల్లో ఉన్నాయి.