కలహాలు, అభిప్రాయభేదాలు ఆ కుటుంబంలో చిచ్చు రేపాయి. మనస్తాపంతో భార్య ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడగా.. భార్య అఘాయిత్యంతో ఆవేదనకు లోనైన భర్త తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వారిద్దరూ బాత్ రూమ్ లోనే అఘాయిత్యాలకు పాల్పడ్డారు. అయితే ఎస్సై ఆత్మహత్యకు పాల్పడే సమయంలో అదే ఇంట్లో ఉన్న పోలీస్ ఉన్నతాధికారులు ఇది గ్రహించలేకపోయారు. ఈ విషాద సంఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. ఒకేసారి ఇద్దరిని కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
జనగామకు చెందిన కాసర్ల శ్రీనివాస్ (55) సబ్ ఇన్ స్పెక్టర్ గా పని చేస్తుండేవాడు. అతడి భార్య స్వరూప (50). జనగామ పట్టణంలో నివసిస్తున్నారు. కాగా వీరిద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని సమాచారం. ఏం జరిగిందో ఏమిటో తెలియదు కానీ గురువారం తెల్లవారుజామున స్వరూప బాత్ రూమ్ కి వెళ్లి అక్కడ కిటికీకి చున్నీతో ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం నిద్రలేచి చూసిన శ్రీనివాస్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఈ సంఘటన వార్త తెలుసుకుని పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఏసీపీ దేవేందర్ రెడ్డి, జనగామ సీఐ నాగబాబు చేరుకుని పరిశీలించారు. బెడ్ రూమ్ లో కూర్చున్న ఎస్సై శ్రీనివాస్ ను పరామర్శించారు. అనంతరం కొద్దిసేపటికే వాష్ రూమ్ కి వెళ్తున్నా అని చెప్పి బాత్ రూమ్ లోకి వెళ్లిన శ్రీనివాస్ తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ హఠాత్పరిణామానికి హతాశయులైన పోలీసులు అధికారులు వెంటనే బాత్ రూమ్ లోకి వెళ్లి చూడగా శ్రీనివాస్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఆస్పత్రికి తరలించారు. కాగా వారి ఆత్మహత్యకు గల కారణాలు మరిన్ని తెలియాల్సి ఉంది.