అందరూ చేసే పనో, అందరూ చెయ్యగలిగే పనో చేస్తే ఎవ్వరూ ఎవర్నీ గొప్ప అనరు. అనుకోరు. ఎవ్వరూ చెయ్యలేని పని చెయ్యగలిగినప్పుడో, చేసినప్పుడో మాత్రమే ఆ వ్యక్తుల్ని ప్రపంచం గొప్ప అని గుర్తిస్తుంది. ఇది ఏ రంగానికైనా సర్వసహజమైన వాస్తవం. అతి చిన్నవయసులో, తమిళంలో హీరోయిన్గా ఎంటరై, అక్కడనుంచి ఎన్నో దశాబ్దాలుగా ఎన్నో పాత్రలు, ఎన్నెన్నో జైత్రయాత్రలు చేసిన విజయశాంతి ఎందుకు ఎలా గ్రేట్ అయ్యారు? ఎర్రగా బుర్రగా ఉన్న హీరోయన్లకి అవకాశాలు రావడం, అందులో చాలా వరకూ విజయాలు సిద్ధించడం కూడా పరిపాటి. అలాటి హీరోయిన్స్ ఎందరినో ఈ సినిమా ప్రపంచం ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిట్లోనూ చూసింది. కానీ విజయశాంతి మాత్రమే ఎందుకు ఎలా గ్రేట్ అయ్యారు అనే ప్రశ్నకి ఎంతో విశ్లేషణ ఉంది.
తొలిరోజుల్లో అంటే కన్నాంబ, శ్రీరంజని, మహానటి అనిపించుకున్న సావిత్రి దగ్గర్నుంచీ అందరూ ఎంత కన్నీరు పెట్టుకోగలిగితే అంత గొప్ప నటిగా పేరు తెచ్చుకున్నారు. అప్పుడు అన్నీ సెంటిమెంట్, ట్రాజెడీ, ఏడిపించే ఫామిలీ డ్రామాలు ఇవే ప్రతీ సినిమా. తర్వాత రోజుల్లో సినిమా హీరోయిన్లకి గ్లామర్ నేర్పింది. ఎవరు గ్లామర్‌గా కనిపిస్తే, కనిపించగలిగితే వాళ్ళకి కూడా మాస్ ప్రేక్షకులు నీరాజనాలు పట్టేశారు. 80ల్లో కొంత గ్లామర్, కొంత యాక్టింగ్ ఎబిలిటీ మిక్స్ అయి జయసుథ లాంటి నటీమణులకు ప్రాచుర్యం లభించింది. సహజనటి లాంటి బిరుదులు కూడా జయసుథని వరించాయి. సావిత్రి తర్వాత జయసుధే అని చెప్పే స్థాయిని జయసుథ అందుకున్నారు. తర్వాత రోజుల్లో హీరోయిన్ పరిస్థితి కాస్తంత క్లిష్టమైన దశలోకి ప్రవేశించింది. అదిగో అప్పుడే విజయశాంతి అనే ఒక హీరోయిన్ తెలుగు సినీ పరిశ్రమకి అవసరం పడింది.
ఎమోషనల్ పెరఫారమెన్స్ విత్ లేడీ ఓరియంటేషన్ కంబైన్ టైంలో విజయశాంతి తప్పితే మరొక గత్యంతరం లేని వ్యవస్థ తలెత్తింది. ప్రతిఘటన సినిమాకి విజయశాంతి గుమ్మం మీద తిష్ట వేసుకుని టి. కృష్ణ లాంటి దర్శకుడు ఆమె డేట్స్ కోసం పెద్ద యుద్ధం చేసి మరీ ప్రతిఘటన అనే సినిమాని తెరకెక్కించాడు. ఆ సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే ఓ పెద్ద సంచలనాత్మకమైన మలుపు. విజయశాంతి మాత్రమే తన పాత్రకి కరెక్టని టి. కృష్ణ త్రికరణశుద్ధిగా నమ్మాడు. ఆయన నమ్మకాన్ని విజయశాంతి నిరూపించారు. అదే ఆమె కెరీర్లో కూడా అతిపెద్ద మలుపు, గెలుపు కూడా. ఎందుకంటే హీరోయిన్ అంటే వర్షంలో తడిసిపోతే చాలు, హీరో విలన్ని కొడుతుంటే పక్కగా నిలబడి కేరింతలు కొడితే చాలు, వయ్యారంగా, ఓంపులు సొంపులు ప్రదర్శిస్తే చాలు అనుకునే కట్టుబాటుని తొలిసారి విజయశాంతి దమ్ముగా బ్రేక్ చేశారు. అక్కడ నుంచి ఆమె కెరీర్ మహోజ్జ్వలంగా వెలిగింది. పోలీస్ లాకప్, కర్తవ్యం, ఆశయం, లేడీబాస్, భారతరత్న, ఒసేయ్ రాములమ్మ లాంటి సినిమాలతో విజయశాంతి విరుచుకుపడ్డారు. హీరోతో పాటు, లేదా హీరో కన్నా కూడా ఎక్కువ డిమాండ్‌ని హీరో కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్‌ని తీసుకోగలిగే, ఆ పరిణామాన్ని పరిశ్రమ సైతం మన్నించి, తలదాల్చే స్థాయిని విజయశాంతి అత్యంత సమర్ధవంతంగా సాధించారు. హీరోతో సమానంగా ఫైట్స్ అండ్ యాక్షన్ కూడా ఆమె చేసి చూపించడంతో ఆమెకు తిరుగేలేదనే దశలోకి విజయశాంతి సునాయాసంగా ప్రయాణించారు. ఇటువంటి విన్యాసం ఒక్క తెలుగులోనే కాదు, భారతీయభాషలలోనే కాదు, వరల్డ్ సినిమాలోనే మరో హీరోయిన్ అనిపించుకున్న ఏ నటీమణి చెయ్యలేకపోయారు. మారుతున్న కాలంలో వచ్చే మార్పలకు విజయశాంతి ఓ గట్టి సమాధానంగా, పటిష్టమైన చిరునామాగా ఎదిగి, మహామహా అనుకున్న హీరోలనే తలదన్నారు. ఇది ఆనాటి నుంచి ఈ నాటి వరకూ మరో హీరోయిన్ కలలో కూడా ఊహించలేకపోయారు. విజయశాంతి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. వన్ అండ్ ఓన్లీ విజయశాంతి అనే టాక్ని ఆమె తనకి తాను స్వయంగా రాసుకున్న చరిత్ర.
ఇంతవరకూ ఆమెకున్న ఆలిండియా రేంజ్‌ని సూచించే లేడీ అమితాబ్ అన్న మాట ఎందుకు రాయలేదంటే కారణముంది దానికి. ఆమె సాగించిన ప్రయాణంలో ఆమె అధిరోహించిన శిఖరాల సాక్షిగా బాలీవుడ్ మీడియానే ఆమెకు లేడీఅమితాబ్ అనే టైటిల్ నిచ్చింది. తొలిరోజుల్లో ఆమె కేవలం విజయశాంతి మాత్రమే. కానీ కర్తవ్యం విడుదలై, అది హిందీలో వైజయంతీ ఐపిఎస్‌గా వచ్చాక ఇండియన్ సినిమాకే ఒళ్ళు ఝల్లుమంది. అటువంటి హీరోయిన్ని వాళ్ళు కూడా ఎప్పుడూ చూడలేదు. అందుకే ఇండియన్ సినిమా ఐకాన్‌గా వ్యవహరించే అమితాబ్ బచ్చన్ పేరిట విజయశాంతిని లేడీ అమితాబ్ అని గర్వంగా ప్రకటించింది బాలీవుడ్ మీడియా.
తమిళంలో ఈ లేడీ అమితాబ్ తెలుగు కన్నా కూడా పెద్ద సెన్సేషన్. రజనీకాంత్ లాంటి డెమీగాడ్ మన్నన్ (ఘరానా మొగుడు) సినిమాకి సైన్ చేసినప్పుడు తనని చెంపదెబ్బ కొట్టాలంటే విజయశాంతి అయితేనే కరెక్టు, ఇంకొకరికి ఆ స్టేచర్ లేదని తెగేసి చెప్పారు. అదీ ఆమె ఘనత. తెలుగులో వచ్చిన బొబ్బిలి సింహం సినిమాని తమిళంలోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమాకి ఆటోరాణి పేరు పెట్టారు. తెలుగులో లేని యాక్షన్ ఫుటేజ్‌ని ప్రత్యేకంగా విజయశాంతి మీద షూట్ చేసి కలిపారు. అది ఆమె పాప్యులారిటీ, ఆటోరాణి అమె కారణంగానే అక్కడ పెద్ద హిట్. ఈ మధ్యన కూడా సరిలేరు నీకెవ్వరూ సినిమాకి మహేష్‌బాబు పక్కన క్యారెక్టర్ అంటే విజయశాంతి అయితేనే ఆ స్టామినా వర్కవుట్ అవుతుందని అనిల్ రావిపూడి కథతో ఆమెను ఒప్పించి మరీ సినిమాలోకి తెచ్చుకున్నాడు. అదెంత పెద్ద హిట్టో మనకి తెలిసిందే. విజయశాంతి కాకపోతే ఆ క్యారెక్టర్ ప్లస్ కాదు మైనస్ అయి, సినిమా ఫ్లాపు అయ్యేదని ఓ పెద్ద దర్శకుడు కామెంట్ చేశాడు. మొన్నీ మధ్యనే రిలీజ్ అయిన కళ్యాణ్‌రామ్ సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతీ ఐపిఎస్లో కూడా ఆమే కావాలని ఏరికోరి పెట్టుకున్నారు. అదీ ఈ రోజు కూడా విజయశాంతికున్న గ్రేట్ ఇమేజ్.
ఇటీవలే హై కమాండ్ నిర్ణయం మేరకు ఎవరెందరు అడ్డుపడినా విజయశాంతిని ఎంఎల్‌సి హోదా వరించింది. రేపోమాపో మినిష్టర్ పదవిని కూడా ఆమె అలంకరించబోతున్నారని అధికారికమైన భోగట్టా.
ఆమె సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా అంతే ఎత్తైన వ్యక్తి. తెలంగాణ సాధనలో ఆమె కృషి, సాధన అపారమైనవి. అనేక పోరాటాలు, అనేకానేక ఉద్యమాలు చేసిచేసినా అలసిపోని వ్యక్తిత్వం. రాజకీయ సంకుల సమరంలో ఎవరెన్ని పావులు ఆమెకు వ్యతిరేకంగా కదిపినా, వాటిని ఆమె ఉక్కు వ్యక్తిత్వమే తొక్కేసింది. ఆమె పార్టీలు మారొచ్చు. ఏ మార్పు అయినా అది బంగారు తెలంగాణ కోసమే అని లేడీ అమితాబ్ నిరూపించుకున్నారు. అవినీతి, బంధుప్రీతి, పక్షపాతం వంటి ప్రాథమిక మానవ బలహీనతలు ఆమెను లొంగదీయలేకపోయాయి. పదవులు, పవర్, ఛెయిర్….ఇవేవీ అమెను ప్రలోభపెట్టలేక, విసిగిపోయాయి. ఆమె ఆమెగా మాత్రమే నిలబడ్డారు. ఆమె ఆమెగా కలియబడ్డారు. ఈ రోజైనా, ఏ రోజైనా కేవలం సినిమాల్లోనే కాదు, రాజకీయ యవనికపైన కూడా ఆమె నడకని ఎవ్వరూ అనుసరించలేరు. ఆమె పరుగును మరొకరు అనుకరించలేకపోయారు. భారతీయరాజకీయరంగంలో కూడా ఆమెతో సరిపోల్చగలిగే నాయకురాలు ఇంకొకరిని వెతకడం దుర్లభం. ఆమె ఆమే