తెలంగాణలో ఇంకా టీడీపీ ఉందనే ఎవరూ నమ్మరు. రాష్ట్ర విభజన తర్వాత… అసలు ఆ పార్టీని జనాలు పూర్తిగా మర్చిపోయారు. కొందరు నేతలు ఉన్నా.. వారు కూడా తర్వాత టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో చేరిపోయారు. అసలు అలాంటి పార్టీ ఒకటి తెలంగాణలో ఉందనే విషయం జనాలు పూర్తిగా మర్చిపోయారు. ఇలాంటి సమయంలో… ఓ సీనియర్ నేత టీడీపీలో చేరారు. ఇది ఒకింత అందరినీ షాకింగ్ కి గురిచేసిందనే చెప్పాలి.
మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో జ్ఞానేశ్వర్ టీడీపీ కండువా కప్పుకున్నారు. కాసానిని చంద్రబాబు టీడీపీలోకి ఆహ్వానించారు. టీటీడీపీ అధ్యక్షులు బక్కని నరసింహులు గారు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు చేరికల కార్యక్రమంలో పాల్గొన్నారు. కాసాని 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కాసాని గతంలో ఎమ్మెల్సీగా, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మెన్‌గా పనిచేశారు.
కాసాని జ్ఞానేశ్వర్ కొద్దిరోజులుగా రాజకీయాల్లో అంత యాక్టివ్‌గా లేరు. కొద్దిరోజుల క్రితం టీఆర్ఎస్లో చేరతారని ప్రచారం జరిగింది. మంత్రి హరీష్‌రావుతో కూడా చర్చించినట్లు ఊహాగానాలు వినిపించాయి. అంతేకాదు బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటెల రాజేందర్ కూడాఇటీవల జ్ఞానేశ్వర్‌ను కలిసి చర్చలు జరిపారు. కానీ ఆయన మాత్రం అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ కాకుండా టీడీపీలో చేరడం ఆసక్తికరంగా మారింది.