మునుగోడు ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక పార్టీపై మరో పార్టీ విమర్శలు చేసుకుంటోంది. కాగా… తాజాగా.. మునుగోడులో అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటర్ల విషయంలో అవకతవకలకు పాల్పడుతోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో… బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ నాయకత్వంలో నేతలు ఈసీని కలిసారు. మునుగోడు ఓటర్ లిస్ట్‌లో టీఆర్ఎస్ అవకతవకలకు పాల్పడిందని బీజేపీ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
మునుగోడులో కొత్తగా 25వేల ఓటర్లు చేరారని.. టీఆర్ఎస్సే ఫేక్ ఓటర్లను చేర్చే కుట్రలకు పాల్పడుతోందని ఎన్నికల సంఘానికి వివరించారు. మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ ప్రజల ఆత్మభిమానానికి, అవినీతి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరు అని తరుణ్ చుగ్ అన్నారు. ఫలితాన్ని ప్రభావం చేసేలా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ఓటర్ లిస్ట్‌లో అవకతవకలకు పాల్పడిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవడంతోపాటు మూడేళ్లుగా ఒకే సెగ్మెంట్లో ఉన్న అధికారులను బదిలీ చేయాలని కోరారు. రాజగోపాల్‌పై కేటీఆర్ మాట్లాడిన మాటలు అర్ధరహితమన్నారు. ఓటమిభయంతోనే టీఆర్ఎస్ దొంగ ఓట్లు సృష్టిస్తోందని విమర్శించారు.
గతంలో ఉప ఎన్నికల్లో 2వేల ఓట్ల కన్నా ఎక్కువగా నమోదు కాలేదని.. కానీ ఇప్పుడు 25 వేల ఓటర్లు కొత్తగా చేరాయని మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు వివరించారు. గత నాలుగేళ్ల నుంచి ఒకేచోట ఉన్న పోలీస్, రెవెన్యూ అధికారులను బదిలీ చేయాలని ఈసీని కోరినట్లు తెలిపారు. మంత్రులు..సెక్రెటరీలని మునుగోడుకు తీసుకొచ్చి అక్కడి నుంచే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు. కేంద్ర బలగాలు, ఎన్నికల పరిశీలకులను మునుగోడుకు పంపాలని ఈసీని కోరినట్లు తెలిపారు.