బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కారణంగా తాను పార్టీలో ఉండలేని పరిస్థితి నెలకొన్నదని, అందుకే తాను ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గురువారం ప్రకటించారు.
బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు (Somu Veerraju) కారణంగా తాను పార్టీలో ఉండలేని పరిస్థితి నెలకొన్నదని, అందుకే తాను ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (kanna lakshminarayana) గురువారం ప్రకటించారు. తాను తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డాకు (JP Nadda) పంపించానని తెలిపారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నప్పుడు తాను వైసీపీ పాలనపై గట్టిగా పోరాడానని, కానీ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు అలా పోరాడటం లేదని ధ్వజమెత్తారు. బీజేపీకి కన్నాతో పాటు మరో పదిహేను మంది నాయకులు రాజీనామా చేశారు. కన్నా మీడియాతో మాట్లాడుతూ… తాను ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) నాయకత్వానికి ఆకర్షితుడినై 2014లో బీజేపీలో చేరానని, 2018లో తనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారన్నారు. తాను పార్టీ ఎదిగేందుకు కృషి చేశానన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తన పనితీరు నచ్చి ఎంతోమంది కమలదళంలో చేరారన్నారు. 2024లో తాను పార్టీని అధికారంలోకి తెచ్చే దిశగా పని చేశానని చెప్పారు. తాను ఎప్పుడు ప్రధాని మోడీ పట్ల కృతజ్ఞతగా ఉంటానని, మోడీ అంటే జీవితకాలం అభిమానం ఉంటుందన్నారు.
పదవుల కోసం కాదు..
కరోనా తర్వాత తనను తొలగించి, సోము వీర్రాజుకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారని గుర్తు చేశారు. కానీ ఏపీలో సోము వీర్రాజు నాయకత్వంపై తాను తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు స్పష్టం చేశారు. సోము వీర్రాజు పార్టీని తన సొంత సంస్థలా నడుపుతున్నారని ఆరోపించారు. ఆయన అధ్యక్షుడయ్యాక పార్టీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయన్నారు. తాను పార్టీలో ఇమడలేక రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. తాను సోము ప్రవర్తన బాగా లేకపోవడం వల్లే పార్టీకి దూరమవుతున్నట్లు క్లారిటీగా చెప్పారు. పదవుల కోసం దూరమవుతున్నారా అని మీడియా ప్రశ్నించగా… తాను నలభై ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో పని చేశానని, కానీ పదవుల కోసం చూడలేదన్నారు. ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద పని చేశానని, తాను పని చేసినందుకు, వారే తనకు మంత్రి పదవులు ఇచ్చారన్నారు.
అదే సమయంలో జీవీఎల్ నర్సింహారావుపై కూడా ఆయన స్పందించారు. కాపు సంఘాల నేతలతో వరుసగా జీవీఎల్ భేటీ అవుతున్నారని, పార్టీతో చర్చించకుండా ఆయన సొంతగా ముందుకు సాగుతున్నారన్నారు. కృష్ణా జిల్లాకు దివంగత రంగా పేరు పెట్టాలని తాము డిమాండ్ చేశామని, ఆ ఉద్యమంలో కూడా జీవీఎల్ పాల్గొని ఉంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. భవిష్యత్తు ఏమిటో తర్వాత చెబుతానన్నారు. కన్నా రాజీనామా ప్రకటన అనంతరం ఆయన అనుచరులు మిఠాయిలు పంచుకున్నారు. ఆయనకు చంద్రబాబుతో పొసిగే అవకాశాలు తక్కువ అని, కాబట్టి జనసేనలోకి వెళ్లవచ్చునని, అదే సమయంలో జనసేనకు ఏపీలో పూర్తి రూపు అంటూ రాలేదని, కాబట్టి టీడీపీలోనికే వెళ్లవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
కాపులు దూరం కాకుండా…
కన్నా కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో అసంతృప్తితో ఉన్నారు. ఆయన పార్టీని వీడుతారనే ప్రచారం చాలాకాలంగా సాగుతోంది. కన్నా రాజీనామాను ముందే పసిగట్టిన అధిష్టానం కాపు సామాజిక వర్గం బీజేపీకి దూరం కాకుండా పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా జీవీఎల్ వరుసగా కాపు నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాపు రిజర్వేషన్లపై పార్లమెంటులో ప్రస్తావించినందుకు, రంగా గురించి ప్రస్తవించినందుకు కాపు నేతలు కృతజ్ఞతలు కూడా చెప్పారు.