దేవీ నవరాత్రలు సందర్భంగా తిరుమలలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో… ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రేపు అనగా సెప్టెంబర్ 28వ తేదీన ఆయన స్వామి వారిని దర్శించుకొని పట్టువస్త్రాలు సమర్పిస్తారని వైసీపీ నేతలు చెప్పారు.
మంగళవారం మధ్యాహ్నం 3.35 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారు. అలిపిరి వద్ద తిరుమలకు విద్యుత్ బస్సును ప్రారంభిస్తారు. తిరుమల గిరుల్ని పర్యావరణ హితంగా మార్చే క్రమంలో తిరుమల కొండపైకి ఎలక్ట్రిక్ బస్సు సర్వీసుల్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.
రాత్రి 8.20 గంటలకు శ్రీవారికి పట్టువ్రస్తాలు సమర్పించి, స్వామి వారిని దర్శించుకుంటారు. రాత్రికి తిరుమలలోనే బసచేసి బుధవారం ఉదయం మరోసారి శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుమలలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నిర్మించిన పరకామణి భవనాన్ని, తర్వాత లక్ష్మీ వీపీఆర్ రెస్ట్‌హౌస్‌ను ప్రారంభిస్తారు. అనంతరం రేణిగుం ట విమానాశ్రయం చేరుకుంటారు.
సీఎం వైఎస్ జగన్ బుధవారం ఉదయం రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలి కాప్టర్లో నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలోని రాంకో సిమెంట్ ఫ్యాక్టరీకి వెళతారు.
కంపెనీ ప్రాంగణంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.55గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో 2.20గంటలకు తాడేపల్లి వెళతారు.