సీఎం కేసీఆర్, కేటీఆర్ పై మరోసారి పొగిడిందే పొగిడాడు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) స్థాపనతో కేసీఆర్ దేశానికి ప్రధాని అవుతాడని, ఇక కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతాడని జోష్యం చెప్పాడు. రాముడు అంటే రామారావు.. చంద్రుడు అంటే కేసీఆర్. ఒకప్పుడు రామజ్యం అనేది విన్నాం.. ఇప్పుడు కళ్లారా చూస్తున్నాం.
ఏడు పదుల వయసులోనూ ఫుల్ జోష్ లో ఉండే నాయకుడు చామకూర మల్లారెడ్డి (Malla Reddy). ఎప్పుడూ సరదాగా ఉంటాడు. తన విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులతో హుషారుగా ఉంటాడు. అతడు ఎక్కడ ఉంటే అక్కడ సందడే. కానీ నోరు జారుతాడు.. ఇరుకున పడతాడు. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాయకుడిని ఆకాశానికి ఎత్తుతాడు. ప్రశంసల వర్షం కురిపించేస్తాడు. ప్రస్తుతం అధికార పార్టీ బీఆర్ఎస్ లో ఉన్నాడు. తెలంగాణ (Telangana) మంత్రిగా కొనసాగుతున్న మల్లారెడ్డి సీఎం కేసీఆర్ (CM KCR), మంత్రి కేటీఆర్ (KTR) అవకాశం దొరికినప్పుడల్లా భజన కార్యక్రమం మొదలుపెడతాడు. ఆయన పొగడ్తలు అలా ఉంటాయి. అహా ఓహో అంటూ ప్రశంసలు కురిపిస్తాడు. తాజాగా సీఎం కేసీఆర్, కేటీఆర్ పై మరోసారి పొగిడిందే పొగిడాడు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) స్థాపనతో కేసీఆర్ దేశానికి ప్రధాని అవుతాడని, ఇక కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతాడని జోష్యం చెప్పాడు.
బడ్జెట్ సమావేశాల వేళ తన కార్మిక శాఖపై చర్చ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడాడు. మైక్ దొరికింది కదా అని కేసీఆర్, కేటీఆర్ పై ప్రశంసలు కురిపించాడు. ‘కేసీఆర్ పాలన చల్లనిది. తొమ్మదేళ్లలో ఎన్నో అద్భుతాలు చేశారు. అందులో యాదాద్రి (Yadadri) ఆలయం, కొత్త సచివాలయం (New Secretariat), భారీ అంబేడ్కర్ విగ్రహం, పోలీస్ కమాండ్ సెంటర్, కాళేశ్వరం (Kaleshwaram), మిషన్ భగీరథ (Mission Bhagiratha) పనులు అద్భుతాలు. తెలంగాణ రాష్ట్రంలో రామచంద్రుల పాలన నడుస్తోంది. రాముడు అంటే రామారావు.. చంద్రుడు అంటే కేసీఆర్. ఒకప్పుడు రామజ్యం అనేది విన్నాం.. ఇప్పుడు కళ్లారా చూస్తున్నాం. తెలంగాణకు ఐటీ రాజ్యం తెచ్చిన ఘనత కేటీఆర్ కే దక్కుతుంది’ అని కేటీఆర్, కేసీఆర్ పై ప్రశంసలు కురిపించాడు. ఇక జాతీయ రాజకీయాలపై స్పందిస్తూ ‘కేసీఆర్ దెబ్బకు ఢిల్లీ అబ్బా అనాలి. రాష్ట్రంలో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు.. దేశంలో కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారు’ అని తెలిపాడు.
ఇక ప్రగతి భవన్ ను పేల్చేస్తామని టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘ఇద్దరు ప్రెసిడెంట్లు ప్రగతి భవన్ (Pragathi Bhavan) పడగొడతం అంటున్నారు. ఈ మాటలు మాట్లాడుతున్న వాళ్లు దుర్మార్గులు’ అని మండిపడ్డారు. తనపై ఐటీ దాడులు జరగడంపై మాట్లాడుతూ.. ‘చదువులు చెప్పే మా మీద ఐటీ దాడులు చేయటం కాదు. దమ్ముంటే వివేక్, ఈటల రాజేందర్ పై ఐటీ దాడులు చేయాలి’ అని మంత్రి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఇక మల్లారెడ్డి మాటలకు అసెంబ్లీలో నవ్వులు విరబూశాయి. శాసనసభ మొత్తం నవ్వులతో నిండిపోయింది.
దావోస్ వెళ్లి ఏం తెచ్చారు అని కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నిస్తే.. ‘మీ హయాంలో జరిగినవన్నీ స్కాములే. మేం తెచ్చేవి స్కీములు’ అని ఆవేశంతో చెప్పారు. ఐటీ అంటే ఇప్పుడు హైదరాబాద్ అని స్పష్టం చేశారు. మల్లారెడ్డి ప్రసంగంతో స్పీకర్ తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు నవ్వులు ఆపుకోలేకపోయారు. తెలంగాణ ప్రభుత్వం కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి అని తెలిపారు.