»Aimim Chief Asaduddin Owaisi Welcomed To Kcr National Politics
KCR భారతదేశమంతా పాలిస్తే మంచిదే: అసదుద్దీన్ ఓవైసీ
హైదరాబాద్ లోని పాతబస్తీ మాత్రం ఆ పార్టీకి కంచుకోట లాంటింది. అక్కడి ఏడు స్థానాల్లో గాలిపటమే ఎగురుతుంది. ఇక హైదరాబాద్ ఎంపీ స్థానం కూడా ఓవైసీదే. అక్కడ దశాబ్దాలుగా ఇదే ఫలితం కనిపిస్తున్నది. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం ఉంటుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) పాలనపై ఏఐఎంఐఎం (AIMIM Party) పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) ప్రశంసల వర్షం కురిపించాడు. తెలంగాణ (Telangana)లో మంచి పరిపాలన కొనసాగుతోందని.. ఇదే పాలన దేశమంతా వస్తే మంచిదేనని వ్యాఖ్యానించారు. ఇక టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ (BRS Party) గా అవతరించడంపై అసదుద్దీన్ స్వాగతించారు. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రావడం శుభ పరిణామం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణతో పాటు దేశంలోని పరిస్థితులపై ఓవైసీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ ఆవరణలోకి గురువారం అసదుద్దీన్ ఓవైసీ వచ్చారు. ఈ సందర్భంగా తమ ఎంఐఎం ఎమ్మెల్యేలతో ముచ్చటించారు. అనంతరం మీడియాతో సరదాగా మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం, తెలంగాణలో 50 ఎమ్మెల్యే సీట్లలో ఎంఐఎం పార్టీ పోటీ, దేశంలో గౌతమ్ అదానీ వ్యవహారం తదితర విషయాలపై ఆయన సమాధానాలు ఇచ్చారు.
‘తెలంగాణలో 50 స్థానాల్లో పోటీపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. అక్టోబర్ వరకు సమయం ఉంది.. నిర్ణయం తీసుకుంటాం. దేశంలోనే తాజ్ మహల్ కంటే అందమైన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ కట్టారు. కొత్త సచివాలయంలో మసీదు నిర్మాణంపై ప్రభుత్వాన్ని అడిగాం. మసీద్ నిర్మిస్తున్నారు. సచివాలయం ప్రారంభోత్సవం అధికారిక కార్యక్రమం.. అక్కడికి వెళ్తాం. పరేడ్ మైదానంలో జరిగే బహిరంగ సభ బీఆర్ఎస్ రాజకీయ సమావేశం. ఇతర పార్టీలను పిలిస్తే వాళ్ల ఇష్టం’ అని ఓవైసీ తెలిపారు.
ఇక కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ప్రస్తావన రావడంతో ‘‘కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామం. తెలంగాణలో మంచి పరిపాలన చేస్తున్నారు.. దేశమంతా వస్తే మంచిదే’ అని బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావాన్ని స్వాగతించారు. తమ పార్టీపై ఇతర పార్టీలు చేస్తున్న ప్రచారంపై హైదరాబాద్ (Hyderabad) ఎంపీ ఓవైసీ స్పందించారు. ‘మమ్మల్ని బిజేపీ బీ టీం అని కాంగ్రెస్ వాళ్లు ప్రచారం చేస్తున్నారు. బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ లో జేపీసీ కోసం అడిగితే ప్రధాని మోడీ ఒప్పుకోవడం లేదు’ అని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు.
కాగా ఏఐఎంఐఎం పార్టీ రాజకీయాలకు కేంద్రంగా మారింది. తెలంగాణలో ఆ పార్టీ 50 ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేస్తుందనే ప్రచారం జోరందుకుంది. ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కూడా స్పందించారు. 50 కాదు మొత్తం 119 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయాలని సవాల్ విసిరారు. అయితే ఎంఐఎం మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టి పారేస్తున్నది. హైదరాబాద్ లోని పాతబస్తీ మాత్రం ఆ పార్టీకి కంచుకోట లాంటింది. అక్కడి ఏడు స్థానాల్లో గాలిపటమే ఎగురుతుంది. ఇక హైదరాబాద్ ఎంపీ స్థానం కూడా ఓవైసీదే. అక్కడ దశాబ్దాలుగా ఇదే ఫలితం కనిపిస్తున్నది. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం ఉంటుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కాకపోతే రెండు, మూడు స్థానాలు మాత్రమే పెంచుకోవాలనే ఆశతో ఎంఐఎం ఉంది. టీఆర్ఎస్ తో ఉన్న మైత్రితో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూడాలి.