»Animal Welfare Board Withdraws Cow Hug Day Appeal On Feb 14th
Valentine’s Dayపై కేంద్రం వెనక్కి .. Feb 14న కౌ హగ్ డే రద్దు
ఏరికోరి అదే రోజు ఆవులను ప్రేమిద్దాం అని పిలుపునివ్వడం రాజకీయంగా వివాదం రేగింది. మతపరమైన అంశాల జోలికి వెళ్లడంతో వివాదాస్పదమవుతున్నది. ఆ రోజు జంటగా ఎవరూ కనిపించినా దాడులు చేస్తామని ఇప్పటికే పలు సంఘాలు ప్రకటించాయి. ప్రేమికుల రోజు పాశ్చాత్య సంస్కృతి అని, దాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఫిబ్రవరి 14వ తేదీ వచ్చిందంటే భారతదేశం (India)లో రచ్చరచ్చ జరుగుతుంది. ఆరోజు యువతీయువకులు కలిసి ఉంటే దాడులకు పాల్పడతారు. ఇంకా రెచ్చిపోయి వారితో తాళి కట్టించేస్తారు. వారిద్దరిని భార్యాభర్తలను చేసేస్తారు. అసలు వారిద్దరూ ఎవరో ఏమిటో తెలుసుకోకుండా మూర్ఖంగా వివాహాలు చేసే సంస్కృతి కొన్ని మత సంఘాలకు ఉంది. మరి అలాంటి రోజు వచ్చేస్తోంది. ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచ ప్రేమికుల దినోత్సవం (Valentine’s Day)గా జరుపుకుంటారు. అమితమైన ప్రేమ ఉన్న వారు తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు వచ్చిన ఒక రోజు. దాన్ని ఎంతో ఉన్నతంగా భావించాల్సి ఉండగా.. ఒక్క భారతదేశంలోనే ఆ దినోత్సవం నాడు వివాదం రేగుతోంది. ప్రేమ అమ్మాయి అబ్బాయి మధ్యే కాదు.. తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులపై కావొచ్చు.. ఎవరిపై ప్రేమ ఉందో వారితో ఆ రోజు ఆనందంగా గడపానికి వచ్చిందే ప్రేమికుల రోజు (Lovers Day).
ప్రతి ఏడాది మాదిరి ఈ ఏడాది ప్రేమికుల రోజు రాగా దీనికి కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఫిబ్రవరి 14వ రోజును గోవును కౌగిలించే రోజు (Cow Hug Day) నిర్వహించాలని నిర్ణయించింది. లవర్స్ డే పాశ్చాత్య సంస్కృతి అని చెబుతూ దానికి విరుద్ధంగా ఆ రోజు గోవులను కౌగిలించుకుందామని భారత జంతు సంరక్షణ బోర్డు (AWBI) పిలుపునిచ్చింది. ‘గోవులు దేశ సంస్కృతీ సంప్రదాయాలకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక’గా బోర్డు ప్రకటించింది. ‘‘ఆవును కౌగిలించుకోవడం చేస్తే శరీరంలోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవహించడంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుంది’’ అని బోర్డు తెలిపింది. ‘‘అందువలన గో ప్రేమికులంతా ఫిబ్రవరి 14వ తేదీన ఆవులను ఆలింగనం చేసుకోండి’’ అని బోర్డు పిలుపునిచ్చింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఫిబ్రవరి 14న చేసుకోమని చెప్పడమే వివాదానికి కారణమైంది. ప్రస్తుతం వాలంటైన్స్ డేను మత సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ రోజు జంటగా ఎవరూ కనిపించినా దాడులు చేస్తామని ఇప్పటికే పలు సంఘాలు ప్రకటించాయి. ప్రేమికుల రోజు పాశ్చాత్య సంస్కృతి అని, దాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
అయితే వాళ్ల అభిప్రాయానికి అనుగుణంగా బోర్డు ఈ నిర్ణయం తీసుకోవడం వివాదం రాజుకుంది. ఏరికోరి అదే రోజు ఆవులను ప్రేమిద్దాం అని పిలుపునివ్వడం రాజకీయంగా వివాదం రేగింది. మతపరమైన అంశాల జోలికి వెళ్లడంతో వివాదాస్పదమవుతున్నది. ఈ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని హిందూత్వవాదులు, కొన్ని మత సంఘాలు స్వాగతించాయి. కానీ మిగతా ప్రజలంతా వ్యతిరేకించారు. ఉద్దేశపూర్వకంగా మతాన్ని లాగొద్దని.. ప్రేమను పంచే రోజును కూడా వివాదాస్పదం చేయడం తగదని కేంద్రంపై ప్రజా సంఘాలు, లౌకిక నాయకులు చెప్పారు.
కౌ హగ్ డేపై తీవ్ర వివాదం ఏర్పడడంతో భారత జంతు సంరక్షణ బోర్డు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోనే ఆవులను కౌగించుకునే దినాన్ని రద్దు చేసిందని సమాచారం. కేంద్ర మత్య్స, పశు సంవర్ధక, డెయిరీ మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు రావడంతో కౌ హగ్ డే పిలుపును వెనక్కి తీసుకుంటున్నట్లు ఆ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి ఎస్కే దత్తా ఉత్తర్వులు జారీ చేశారు.