»My Situation Is Like Mutyala Muggu Heroine Said Jagga Reddy
Jagga Reddy నాది ‘ముత్యాల ముగ్గు’ హీరోయిన్ బతుకే
రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డికి మధ్య పొసగడం లేదు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ఎన్నికైనప్పటి నుంచి పార్టీలో జగ్గారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ప్రత్యామ్నాయ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ విధానాలను విమర్శించే వారు రెండింటి మధ్య తేడా తెలుసుకోవాలని హితవు పలికారు.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు (Telangana Budget Sessions) జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలు రోజురోజు రసవత్తరంగా జరుగుతున్నాయి. రోజుకో పరిణామం అసెంబ్లీ ఆవరణలో చోటుచేసుకుంటున్నాయి. సభ లోపల ఎమ్మెల్యేలు పార్టీల వారీగా చీలినా బయటకు వచ్చాక ఆప్యాయంగా పలుకరించుకుంటున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకరినొకరు మాట్లాడుకున్నారు. మీడియా పాయింట్ దగ్గర సందడి వాతావరణం అలుముకుంది. మీడియా పాయింట్ వద్ద సంగారెడ్డి కాంగ్రెస్ (Congress Party) ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (Jagga Reddy) తనదైన ప్రసంగాలతో ఆసక్తికరంగా మారాడు. తాజాగా ఓ సినిమాలో హీరోయిన్ లాగా తాను బతుకుతున్నట్లు ప్రకటించాడు.
ప్రగతి భవన్ ను నక్సలైట్లు పేల్చి వేయాలని టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై ఈ సందర్భంగా జగ్గారెడ్డి స్పందించారు. ‘టెర్రరిస్టు విధానాలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. దేశ ప్రజల భద్రత కోసం కాంగ్రెస్ నిర్ణయాలు తీసుకుంది. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ టెర్రరిస్టులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారు. అందుకే వారు బలి కావడం జరిగింది. ప్రజల కోసం పనిచేస్తున్న నక్సలైట్ లను జన జీవన స్రవంతిలో కలవాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. రాజకీయ నాయకుల, నక్సలైట్ల భావన రెండు ప్రజల కోసమే. ప్రజల గురించే ఆలోచన చేస్తారు. కానీ పని చేసే విధానం మాత్రమే వేరు. రాజకీయ నాయకులు చట్ట పరిధిలో పని చేస్తారు. నక్సలైట్లు చట్ట పరిధిలో పని చేయరు. అంతే తేడా’ అని జగ్గారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్ హయాంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ విధానాలను విమర్శించే వారు రెండింటి మధ్య తేడా తెలుసుకోవాలని హితవు పలికారు.
ఇక తెలంగాణలో కొనసాగుతున్న పాదయాత్రలపైన జగ్గారెడ్డి స్పందిస్తూ.. ‘పాదయాత్రలు ఎవరైనా చేసుకోవచ్చు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎవరి నియోజకవర్గాల్లో వారు పాదయాత్రలు చేసుకుంటాం. నన్ను రాష్ట్రంలో ఎవరైనా పిలిస్తే వెళ్లి వారి జిల్లాలో పాదయాత్ర చేస్తా’ అని ప్రకటించారు. అయితే పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలిస్తే వెళ్తారా అని మీడియా ప్రశ్నించగా.. ‘నో కామెంట్స్’ అని సమాధానమిచ్చారు.
ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నేను ఇంకా ముత్యాల ముగ్గు హీరోయిన్ బతుకే బతుకుతున్నా’ అని జగ్గారెడ్డి తెలిపారు. కాగా అసెంబ్లీలో చర్చోపచర్చలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య వాడీవాడీ చర్చలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ పేల్చి వేస్తామని చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీ తీవ్ర దుమారం రేపాయి. బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఇక మంత్రి కేటీఆర్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తీరును తూర్పారబట్టారు. అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డికి మధ్య పొసగడం లేదు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ఎన్నికైనప్పటి నుంచి పార్టీలో జగ్గారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ప్రత్యామ్నాయ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే గురువారం సీఎం కేసీఆర్ తో జగ్గారెడ్డి సమావేశం కావడం కాంగ్రెస్ లో కలకలం రేగింది. అయితే తన సంగారెడ్డి నియోజకవర్గ సమస్యలపై సీఎం కేసీఆర్ కు వినతిపత్రం ఇచ్చినట్లు వివరణ ఇచ్చారు.