»Tdp Released Jaganasura Raktacharitra Book On Ys Vivekananda Reddy Case
YS Viveka హత్యపై ‘జగనాసుర రక్త చరిత్ర’ పుస్తకం.. వాస్తవాలివే
జగన్ ప్రభుత్వ దౌర్జన్యాలు, అరాచకాలపై టీడీపీ పుస్తకం విడుదల చేసింది. బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య అనంతరం జరిగిన పరిణామాలపై ‘జగనాసుర రక్తచరిత్ర’ పేరిట పుస్తకం తీసుకువచ్చింది. వివేకా హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారులు ఎవరనే దానిపై సవివరంగా పుస్తకం రూపొందించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో సాగుతున్న దుర్మార్గ పాలనపై తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) పోరాటం తీవ్రం చేసింది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) సాగిస్తున్న అరాచకాలు, విధ్వంసం, ప్రజా వ్యతిరేక విధానాలపై టీడీపీ ప్రతి చోట నిలదీస్తూనే ఉంది. తాజాగా జగన్ ప్రభుత్వ దౌర్జన్యాలు, అరాచకాలపై టీడీపీ పుస్తకం విడుదల చేసింది. బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య అనంతరం జరిగిన పరిణామాలపై ‘జగనాసుర రక్తచరిత్ర’ (Jaganasura Rakta Charitra) పేరిట పుస్తకం తీసుకువచ్చింది. ఈ పుస్తకాన్ని పార్టీ కార్యాలయంలో శుక్రవారం టీడీపీ అధ్యక్షుడు అచ్చెనాయుడు, సీనియర్ నాయకులు వర్ల రామయ్య, నక్కా ఆనందబాబు, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బోండా ఉమ తదితరులు పుస్తకాన్ని విడుదల చేశారు.
అనంతరం పార్టీ అధ్యక్షుడు అచ్చెనాయుడు (Atchannaidu)తో పాటు ఇతర నాయకులు మీడియాతో మాట్లాడారు. ‘మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సీఎం జగన్ ప్యాలెస్ లోనే వ్యూహ రచన జరిగింది. సీబీఐ విచారణలో వేళ్లన్నీ సీఎం దంపతులపైనే చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం పదవికి జగన్ రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు. వివేకా హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారులు ఎవరనే దానిపై సవివరంగా పుస్తకం రూపొందించినట్లు తెలిపారు.
‘వివేకనంద రెడ్డి హత్యపై దుష్ప్రచారంతో 2019 ఎన్నికల్లో జగన్ లబ్ధి పొందాడు. కానీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హత్య చేయించాడని అబద్ధపు ప్రచారం చేశారు. ఎన్నికల సమయంలో బాబాయ్ హత్యను ఆసరాగా చేసుకుని అధికారంలోకి వచ్చారు. వివేకాది హత్య కాదు అని.. గుండెపోటుగా చెప్పి అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కలిసి హత్యకు సంబంధించిన ఆనవాళ్లు ఏమీ లేకుండా చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో అవినాశ్ రెడ్డి ఆదాయం రూ.18 కోట్లుగా ప్రకటించాడు. మరి వివేకా హత్యకు సుపారీగా రూ.40 కోట్లు ఇచ్చారంటే..? ఎవరు ఇచ్చారో తెలియాలి కదా? బాబాయ్ హత్యపై ఇంత జరుగుతుంటే సీఎం జగన్ మాత్రం ఎందుకు మాట్లాడడం లేదు? ఈ కేసులోని అంశాలను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ సీపీ గుర్తింపు రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి మేం లేఖ రాస్తాం’’ అని అచ్చెనాయుడు ప్రకటించాడు. ఈ హత్య రాజకీయంపై టీడీపీ పోరాటం తీవ్రం చేస్తుందని తెలిపారు.
బాబాయ్ గొడ్డలిపోటులో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత అన్నీ అబ్బాయే (జగన్) అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వివేకాహత్యోదంతంపై పూర్తివాస్తవాలతో తీసుకొచ్చిన ‘జగనాసుర రక్తచరిత్ర’ పుస్తకాన్ని ఇంటింటికి పంపిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. అధికారం కోసం జగన్ ఎంతటి దారుణాలకైనా పాల్పడుతాడు అని చెప్పడానికి నిదర్శనమే బాబాయ్ హత్య అని స్పష్టం చేశారు. విశాఖపట్టణం విమానాశ్రయంలో కోడి కత్తి డ్రామా కూడా అలాంటిదేనని తెలిపారు. ‘జగన్ రెడ్డి నరహంతక పాలనకు చరమ గీతం పాడుదాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం’ అనే నినాదంతో ఈ పుస్తకాన్ని అందరికీ చేరువ చేస్తామని తెలిపారు.
వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఏపీ పోలీసులు విచారణకు ప్రభావితులవుతారని హైకోర్టు తీర్పునివ్వడంతో ఆ కోర్టు తెలంగాణకు బదిలీ అయ్యింది. ప్రస్తుతం సీబీఐ విచారణ చేపడుతోంది. విచారణలో భాగంగా వైఎస్సార్ సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని విచారణ చేసిన విషయం తెలిసిందే. జగన్ ఓఎస్డీ, జగన్ వ్యక్తిగత సహాయకుడుతో పాటు మరికొందరిని విచారణ చేపడుతున్నారు. ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.