Chandrababu : అభ్యర్థుల పని తీరు బాగోకుంటే మార్చేందుకు వెనకాడం : చంద్రబాబు
టీడీపీ తొలి జాబితాలో సీట్లు దక్కించుకున్న అభ్యర్థుల పనితీరు అంచనాలను అందుకోకపోతే సీటు మరొకరికి కేటాయించేందుకు వెనకాడబోమని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.
Chandrababu with MLA Contest Candidates: తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి సీట్లు దక్కించుకున్న అభ్యర్థులంతా కష్టపడి పని చేయాలని ఆ పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన వారితో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. సీట్లు పొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి నుంచి ఎన్నికల వరకు ఏమేం చేయాలనే దానిపై దిశా నిర్దేశం చేశారు. ప్రతి వారం అభ్యర్థుల పని తీరు ఎలా ఉందన్న దానిపై సమీక్ష జరుపుతామని అన్నారు. ఒక వేళ పని తీరు బాగోకపోతే పేర్లు మార్చేసేందుకు వెనకాడబోమని స్పష్టం చేశారు.
ఎన్నికల వరకు ప్రతి వారం అభ్యర్థుల పని తీరుపై సర్వే చేస్తామని చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) స్పష్టం చేశారు. జనసేన, తెలుగు దేశం పార్టీ నేతలు సమన్వయంతో ముందుకు నడవాలని సూచించారు. అప్పుడే వంద శాతం ఓట్లు తమకు వచ్చే అవకాశాలు ఉంటాయన్నారు. వైసీపీ నేతలు ఎవరైనా తమ పార్టీల్లో చేరతామని వస్తే వారిని సాదరంగా ఆహ్వానించాలని చెప్పారు.
జగన్ రెడ్డి పాలనను నమ్ముకోలేదని దౌర్జన్యాలు, దొంగ ఓట్లు, డబ్బు, అక్రమాలను నమ్ముకున్నారని చంద్రబాబు ధ్వజం ఎత్తారు. తమ అభ్యర్థులపై, తమపై ఎలాంటి కుట్రలు కుతంత్రాలు జరుగుతాయో తెలియదని, అన్నింటికీ సంసిద్ధంగా ఉండాలని అన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ విధానాలు, స్థానిక ఎమ్మెల్యేల పని తీరును ఎండగట్టేలా కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. జనసేన(Jana Sena) నేతలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికలకు వెళ్లాలని పిలుపునిచ్చారు.