తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన 27 కిలోల నగలను త్వరలో వేలం వేయనున్నారు. ఆమె చెల్లించాల్సిన జరిమానాలు చెల్లించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
Jayalalithaa’s jewels : అక్రమాస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిల కోర్టుకు భారీగా జరిమానాలు చెల్లించాల్సి ఉంది. ఆమె చనిపోయిన తర్వాత వాటిని కట్టేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో జయలలిత 27 కిలోల నగలను వేలం వేయాలని బెంగళూరు ప్రత్యేక కోర్టు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న జయలలిత(Jayalalitha)కు 2014లో బెంగళూరు ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. ఆమెతో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు కూడా నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా(fine) విధించింది. దీంతో ఈ తీర్పును సవాలు చేస్తూ వారు కర్ణాటక హై కోర్టులో అప్పీల్ చేశారు. కేసును విచారించిన హై కోర్టు ఆ నలుగురిని విడుదల చేసింది.
ఆ తర్వాత కర్ణటక ప్రభుత్వం ఈ విషయమై సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇది విచారణ జరుగుతున్న సమయంలోనే 2016 డిసెంబరులో జయలలిత మరణించారు. తర్వాత బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. ఆ ప్రకారమే చేయాలని కోరింది. అయితే ఆ జరిమానా కట్టేందుకు ఇప్పటి వరకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో అప్పట్లో అవినీతి నిరోధక శాఖ జయలలిత ఇంట్లో స్వాధీనం చేసుకున్న 27 కిలోల నగలు, 800 కిలోల వెండి, వజ్రాల నగలు తదితరాలను కోర్టుకు అప్పగించారు. ఇప్పుడు ఆ నగలను మార్చి 6, 7 తేదీల్లో తమిళనాడు తీసుకొచ్చి హోం శాఖ కార్యదర్శికి అప్పగించనున్నారు. ప్రస్తుత విలువ ఆధారంగా వాటిని వేలం వేయనున్నారు. ఈ నగల ద్వారా రూ.40 కోట్ల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే జయలలిత కట్టాల్సిన జరిమానా రూ.100 కోట్లుగా ఉంది. కాబట్టి మిగిలిన మొత్తాన్ని వసూలు చేయడానికి ఇతర స్థిరాస్తులను వేలానికి పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.